ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న పల్లెలు ప్రస్తుతం టెక్నాలజీ యుగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇంతకాలం విద్యుత్, తాగునీరు, వైద్యం లాంటి కనీస అవసరాలను పొందలేకపోయిన గ్రామాలు నేడు సెల్ ఫోన్ చేతబట్టి ఆధునికతను అందిపుచ్చుకునే యత్నం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ లో ఇంతకాలం మావోయిస్టుల ప్రభావంతో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
2026 మార్చి నాటికి దేశంలో మావోయిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంతో మావోయిస్టుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు ఛత్తీస్‌గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించడమో లేదా లొంగిపోవడమో జరుగుతుంది. దీంతో ఇంతకాలం మావోయిస్టుల ప్రభావంతో కనీస అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను అక్కడి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా చేస్తోంది.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతంలో ఒకప్పుడు విద్యుత్ లేదు. రోడ్లు, వైద్యం, ఇతర కనీస అవసరాల సంగతి సరేసరి. ఎన్నో ఏళ్లుగా కొండపల్లి కనీస అభివృద్ధి లేకుండా ఉంది. అయితే ఇప్పుడు ఆ గ్రామంలో రోడ్లు, విద్యుతే కాదు ఏకంగా మెుబైల్ టవర్ పడడంతో అక్కడి ప్రజలు సంతోష పడిపోతున్నారు. గిరిజనుల సంప్రదాయం ప్రకారం మెుక్కి డోలు, డప్పులు వాయించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి గ్రామంలో సెల్ ఫోన్ల సిగ్నల్స్ వస్తాయని ఆనందపడిపోతున్నారు.
కొండపల్లి మాదిరిగానే ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంది. "నియాద్ నెల్ల నార్" అనే పథకంలో భాగంగా అక్కడి ప్రభుత్వ మావోయిస్టు ప్రభావిత గ్రామాల రూపు రేఖలను మారుస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకూ 728 కొత్త టవర్లు నిర్మించబడ్డాయి. వాటిలో 116 అత్యంత ప్రభావితమైన ప్రాంతంలో ఉన్నవి. అంతేకాకుండా 69 భద్రతా క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దాదాపు 403 గ్రామాలు అభివృద్ధి బాటలో పయణిస్తున్నాయని అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
మెుబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో ఆధార్, ఫెన్షన్, రేషన్ లతో పాటు ఇతరాత్ర ప్రభుత్వ కార్యకలాపాల లబ్ధి కోసం పదుల కిలోమీటర్లు గిరిజనులు ప్రయాణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఆ సేవలను ప్రస్తుతం ఇంటినుంచే పొందవచ్చంది.రాబోయే కాలంలో ఈ ప్రాంతాలు మరింతగా అభివృద్ది చెందుతాయని అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


