శత్రు భయంకర క్షిపణి | USA military uses PRSM for first time | Sakshi
Sakshi News home page

శత్రు భయంకర క్షిపణి

Mar 8 2026 5:49 AM | Updated on Mar 8 2026 10:39 AM

USA military uses PRSM for first time

తొలిసారిగా ప్రెసిషన్‌ స్ట్రైక్‌ 

మిసైల్‌ను ప్రయోగించిన అమెరికా 

తీవ్రమైన దాడి చేయడంలో దిట్ట 

పీఆర్‌ఎస్‌ఎం క్షిపణితో పెను వినాశనం

ఇరాన్‌పై ఇంతకు మునుపెన్నడూలేనంతగా విచ్చలవిడిగా దాడులు చేస్తున్న అమెరికా బలగాలు తాజాగా తమ అమ్ములపొదిలోని మరో నూతన క్షిపణిని ఇరాన్‌ మీదకు ప్రయోగించాయి. ప్రపంచంలో ఆయుధాల తయారీరంగ దిగ్గజం లాక్‌హీడ్‌ మార్టీన్‌ ప్రత్యేకంగా అమెరికా బలగాల కోసం అభివృద్ధిచేసి ఇచ్చిన ‘ప్రెసిషన్‌ స్ట్రైక్‌ మిసైల్‌(పీఆర్‌ఎస్‌ఎం) సైతం ఇప్పుడు ఇరాన్‌పై దాడులకు సిద్ధమైంది.

యుద్ధంలో పీఆర్‌ఎస్‌ఎంను తొలిసారిగా ఉపయోగించినట్లు అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ‘‘చరిత్రలోనే తొలిసారిగా దీర్ఘ శ్రేణి క్షిపణి పీఆర్‌ఎస్‌ఎంను ఇరాన్‌పై మొదలెట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’లో ఉపయోగించాం. తీవ్రమైన దాడులను విజయవంతంగా పూర్తిచేసింది. క్షిపణుల సాయంతో శత్రుసేనలను ఎటూ పాలుపోకుండా చేస్తున్న మా సాయుధ బలగాల శక్తియుక్తులను చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నా’’అని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ కమాండర్‌ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ఖాతాలో వ్యాఖ్యానించారు. క్షిపణి లాంచర్‌ అయిన హైమొబిలిటీ ఆర్టీలరీ రాకెట్‌ సిస్టమ్‌(హైమార్స్‌)ఎం142 నుంచి పీఆర్‌ఎస్‌ఎంను ప్రయోగించిన వీడియోను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తన ఖాతాలో షేర్‌చేశారు. 

దాడిచేస్తే తప్పించుకోవడం కల్ల.. 
అమెరికాలోని మేరీల్యాండ్‌ కేంద్రంగా పనిచేసే లాక్‌హీడ్‌ మార్టీన్‌ సంస్థ 2023 డిసెంబర్‌లో ఈ రకం క్షిపణులను అమెరికా బలగాలను అప్పగించింది. కనిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంలో నాశనంచేయడం పీఆర్‌ఎస్‌ఎంల ప్రత్యేకత. రాకెట్లను ప్రయోగించే వాహనాలైన మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్‌(ఎంఆర్‌ఎల్‌ఎస్‌)తోపాటు హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్‌ సిస్టమ్‌(హైమార్స్‌)ల నుంచి క్షిపణిని ప్రయోగించవచ్చు.

ముఖ్యంగా ఎంఎల్‌ఆర్‌ఎస్‌ఎం–270, హైమార్స్‌ఎం–142 వాహనాల మీద నుంచి కొత్త క్షిపణులను ఎంతో సులభంగా ప్రయోగించవచ్చు. దీని దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. క్షిపణిని ఇతర రకాల లాంచర్‌ల నుంచి సైతం ప్రయోగించవచ్చు. అత్యవసర సమయాల్లో ఎలాగైనా ఇతర లాంచర్‌ల నుంచి ప్రయోగించేందుకు వీలుగా ‘ఓపెన్‌ సిస్టమ్‌ ఆర్కిటెక్చర్‌’విధానంలో దీనిని రూపొందించారు. వేర్వేరు ఇతర కంపెనీల లాంచర్‌ నుంచి ఎంతో వేగంగా దీనిని ప్రయోగించవచ్చు.  

అత్యంత సురక్షితం.. 
యుద్ధక్షేత్రాలకు తరలించే క్రమంలో పొరపాటున పేలిపోయే అవకాశమే ఉండదు. ప్రయోగించకముందే రవాణా సమయంలో పొరపాటున కిందపడినా, అగి్నకి ఆహుతైనా, పదునైన వస్తువులు గుచ్చుకున్నా ఇది పేలదు. కేవలం ప్రయోగించాక ట్రిగ్గర్‌ను క్రియాశీలంచేశాక మాత్రమే భారీస్థాయిలో పేలిపోయి పెనువినాశనం సృష్టిస్తుంది. ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్‌ (ఏటీఏసీఎం)గా పిలిచే దీర్ఘశ్రేణి పాత తరం ఎంజీఎం–140 బాలిస్టిక్‌ క్షిపణుల స్థానంలో కొత్త పీఆర్‌ఎస్‌ఎంలను తీసుకొచ్చారు. ఇవి గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు.

పాత క్షిపణుల పరిధి కేవలం 300 కిలోమీటర్లుకాగా కొత్త క్షిపణుల పరిధి 500 కిలోమీటర్లు. దీంతో పాత లాంచర్‌ల మీద నుంచే మరింత ఎక్కువ దూరాలకు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించే వీలు చిక్కిందని అమెరికా ఆర్మీ అధికారులు చెప్పారు. దుబాయ్‌ సమీపంలోని రస్‌ అల్‌ ఖైమా సమీపంలోని మూసండం ద్వీపకల్పం ఇరాన్‌కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే పరిధితో పనిచేసే పీఆర్‌ఎస్‌ఎంలతో ఇరాన్‌పైకి నిరాటంకంగా దాడిచేయాలని అమెరికా భావిస్తోంది.

రష్యాతో 1987లో కుదుర్చుకున్న మధ్య శ్రేణి అణ్వాస్త్రాల నిరోధక చట్టం అమల్లో ఉంటే పీఆర్‌ఎస్‌ఎస్‌ల వినియోగానికి అవరోధాలు ఎదురయ్యేవి. 2019లో ఈ ఒప్పందం నుంచి ట్రంప్‌ తప్పుకోవడంతో కొత్త క్షిపణుల తయారీ, వినియోగానికి అమెరికా తలుపులు బార్లా తెరిచిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.      – సాక్షి,నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement