ఇరాన్‌ యుద్ధం.. ముడిచమురు మంట | Crude oil rises by more than 20 dollars in a week | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం.. ముడిచమురు మంట

Mar 8 2026 5:13 AM | Updated on Mar 8 2026 6:12 AM

Crude oil rises by more than 20 dollars in a week

ఇరాన్‌ యుద్ధంతో భగ్గుమన్న ధరలు

వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్‌

70 డాలర్ల నుంచి ఏకంగా 92.69 డాలర్లకు..

100ను తాకవచ్చంటున్న నిపుణులు

దేశీయంగా తీవ్రత తగ్గించేందుకు పలు చర్యలు  

(సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి)  :  పశ్చిమాసియా సంక్షోభంతో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేయ­­టం.. ఇరాన్‌ ప్రతిదాడులకు దిగటంతో పాటు గల్ఫ్‌­లోని అమెరికా రక్షణ స్థావరాలన్నిటిపైనా గురిపెట్టడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రపంచ చమురు సరఫరాకు నాడీ వ్యవస్థలాంటి హోర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్‌ ఆంక్షలు విధించటంతో చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. 

ఇంధన అవసరాలపై భయాందోళనలతో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నా­యి. ఈ నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ క్షిపణుల దాడి ఆర­ంభించే నాటికి బ్యారెల్‌ ముడిచమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. వారం తిరిగేసరికి శుక్రవారం ఏకంగా 92.69 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే లండన్‌ మా­ర్కె­ట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఏకంగా 13 శాతం పెరగటం గమనార్హం. ఈ ధోరణి కొనసాగితే ధర మరింత పెరిగి తక్ష­ణం 100 డాలర్లు దాటేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

దిగుమతులపై భారం... 
భారత్‌కు అవసరమైన చమురులో 85–88 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. కాబట్టి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతుంది. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత్‌ ముడి చమురు దిగు­మతుల కోసం 137 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

ఈ ఏడా­ది తొలి పది నెలల్లో 206.3 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ కోసం 100.4 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరగటంతో పాటు ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. యుద్ధం సుదీర్ఘ కా­లం కొనసాగితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ధరలు పెరిగి ఆయా రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చు. రవాణాపై ప్రభావం పడితే అది అన్ని వస్తువులకూ వ్యాపిస్తుంది.

దేశీయంగా పలు చర్యలు...
ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి భారత్‌ ఇప్పటికేపలు చర్యలు తీసుకుంటోంది.  వ్యూహాత్మకంగా చమురు నిల్వలను పెంచుకోవటంతో పాటు పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని విస్తరించటం.... ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవటం వంటివి ఇప్పటికే చేస్తోంది.  

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద ఆదేశాలు జారీ చేస్తూ... ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని, పెట్రోకెమికల్స్‌ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్‌ ఉపయోగించడానికి వీల్లేదని, వాటితో కేవలం ఎల్పీజీనే ఉత్పత్తి చేయాలని స్పష్టంచేసింది. 

మన దగ్గర 6-8 వారాల డిమాండ్‌కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు­న్నాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికితోడు దేశీ­యంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్‌ నిల్వలూ ఉన్నాయని, సంక్షోభం ఎక్కువకాలం కొన­సాగితే సరిపడేంత ఆయిల్‌ను అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించింది.  

ధరలు పెరిగిందిలా...
ఫిబ్రవరి 28  71 డాలర్లు 
మార్చి 7 92.69 డాలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement