అర్ధరాత్రి వేళ ఇద్దరు యువతులపై రౌడీషీటర్ల దౌర్జన్యం
సచివాలయానికి లాక్కెళ్లి యువతిపై ఓ రౌడీషీటర్ అత్యాచారం?
పోలీసులు సరిగా స్పందించలేదని బాధితుల ఆరోపణ
చిన్న కేసుగా చిత్రీకరించేందుకు పోలీసుల యత్నం
ఏలూరు టౌన్: ఏలూరులో అర్ధరాత్రి వేళ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని వారి ఇంటి తలుపులు, కిటికీలు బాదుతూ ఇద్దరు రౌడీషీటర్లు భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం వారిలో ఒక యువతిని ఓ రౌడీషీటర్ కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయానికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత ఇద్దరు యువతులనూ రౌడీషీటర్లు బెల్టుతో దారుణంగా కొట్టినట్లు తెలిసింది. తాము పోలీసులను ఆశ్రయిస్తే వారు సరిగ్గా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి.. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి (23) తండ్రి మరణించగా.. ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి వచ్చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఏలూరుకు చెందిన యువతి వద్ద ఉంటోంది. ఈ నెల 2న రాత్రివేళ వీరిద్దరూ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నగరంలోని కొత్తపేటకు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు అతిగా మద్యం సేవించి అర్ధరాత్రి వేళ యువతులు ఉంటున్న ఇంటి తలుపులు, కిటీకీలు బాదుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన యువతి తలుపులు తీయగా.. ఆమెను కొట్టుకుంటూ లాక్కెళ్లిన ఒక రౌడీషీటర్ సమీపంలోని సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు.
ఆ తర్వాత యువతులిద్దరినీ బెదిరించి వెళ్లిపోయిన ఆ ఇద్దరు రౌడీషీటర్లు.. మరో గంట తర్వాత స్నేహితులతో వచ్చి యువతులను మళ్లీ బెల్టులతో ఇష్టమొచ్చినట్లు కొట్టి బెదిరించి వెళ్లారు. దీంతో బాధితులిద్దరూ నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని సమాచారం. అయితే, పోలీసు ఉన్నతాధికారులకు ఈ దారుణ ఘటన గురించి తెలియడంతో అత్యాచార బాధితురాలిని ఓ ఆçస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అలాగే, హడావుడిగా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఈ ఘటనను పోలీసులు చిన్న కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. పోలీసులు ఈ ఘటనపై మీడియాకు సైతం తెలియకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నారు.


