నెల్లూరు పొదలకూరు రోడ్డులోని శివాజీనగర్‌లో ఇంట్లోకి చేరిన నీరు
యువకుడు గల్లంతు
‘దిత్వా’ ప్రభావంతో భారీవర్షాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/విడవలూరు: దిత్వా తుపాను అల్పపీడనంగా మారి చెన్నైలోని మహాబలిపురం వద్ద తీరం దాటినా.. దాని ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నెల్లూరు నగరం అతలాకుతలమైంది. ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిల వద్ద పెద్ద ఎత్తున నీరు చేరిపోయింది.
విజయమహల్ గేట్ వద్ద ఉన్న బాక్స్‌టైపు బ్రిడ్జి మునిగిపోయింది. మాగుంటలేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద కారు నీటిలో చిక్కుకుంది. నగరంలోని తూర్పుప్రాంతాలైన బాలాజీనగర్, స్టోన్‌హౌస్‌పేట, హరనాథపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీలను వరదనీరు చుట్టుముట్టింది. నెల్లూరులోని టెక్కేమిట్ట రోడ్డులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోకి నీరు చేరింది.
నీట మునిగిన పొలాలు..
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పొలాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. 30 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం 3011 (7527.5 ఎకరాలు) హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరినార్లు, నాట్లు 6,970 ఎకరాల్లో, శనగ 557.5 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 6,321 మంది రైతులు నష్టపోయారు. వరద నీరు చేరడంతో వెంకటాచలం, మనుబోలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నెల్లూరు అతలాకుతలమవుతున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు. సహాయక చర్యలు చేపట్టడం లేదు.
కూలిన పోలీస్ స్టేషన్ సీలింగ్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు పోలీస్‌స్టేషన్లోని సీలింగ్ గురువారం వేకువజామున ఒక్కసారిగా కూలిపోయింది. సిబ్బంది వేరే గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. ఫర్నీచర్, సీలింగ్‌కు ఉన్న ఫ్యాన్లు, లైట్లు పూర్తిగా «ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలాన్ని ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్ పరిశీలించారు. ఈ స్మార్ట్ పోలీస్‌స్టేషన్‌ను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరి్మంచారు. నిర్మాణం చేపట్టిన ఏడేళ్లకే సీలింగ్ కూలిపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


