బుచ్చి– రాజుపాళెం రోడ్డుపై తాత్కాలికంగా గుంతల్లో పోసిన మట్టి, మలిదేవి కాలువ వద్ద రోడ్డు దుస్థితి ఇలా..
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మామూలు రోజుల్లోనే రహదారులు గుంతలమయంగా ఉంటాయి. అలాంటిది గతవారం రోజులుగా జోరు వర్షాలు కురవడంతో పట్టణంలోని రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 16వ వార్డులోని చెన్నూరు రోడ్డు నుంచి రాజుపాళెం రోడ్డు వైపు ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రయాణించాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఈ రహదారి వెంబడి తహసీల్దార్ కార్యాలయం, గ్రంథాలయం, అంబేడ్కర్ భవన్, బెజవాడ గోపాల్‌రెడ్డి పార్కు, సామాజిక ఆరోగ్యం కేంద్రం, పోలీస్‌స్టేషన్, ఎస్పీ బాలు వసతి భవనం, డీఎల్‌ఎన్నార్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. నిత్యం కొడవలూరు మండలం రాజుపాళెం, బుచ్చిలోని రూరల్ ప్రాంతాల నుంచి ఈ రహదారిపై వేల మంది ప్రయాణిస్తుంటారు. అధికారులు ఇదే దారిన వెళ్తుంటారు. అ యినా రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు..
మరోపక్క చెన్నూరురోడ్డులోని మలిదేవి కాలువ వద్ద నుంచి శివాలయం వరకు రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తోంది. వాహనదారులు, పాదచారులు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఈ రోడ్డుపై వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటన ఈ ప్రాంతాల వద్ద ఉందంటే మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే.
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని ఆ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ బిట్రగుంట ప్రమీలమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకుడు నారాయణ తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాళెం నుంచి రాజుపాళెం వైపు వెళ్లే రోడ్డు, మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్‌అండ్‌బీ ద్వారా గానీ, మున్సిపల్ కమిషనర్ ద్వారా కానీ శాశ్వతంగా రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని తహసీల్దార్‌ను కోరినట్లు వివరించారు.


