కాశినాయన: చంద్రబాబు పాలనలో ఎరువుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతుండటంతో రైతులపై మోయలేని భారం పడుతోంది. పెట్టుబడి సాయం అంతంత మాత్రంగానే ఉండటం, గిట్టుబాటు ధరలు లేక నష్టాల పాలవుతున్నారు. గత ఏడాది సాగు చేసిన వరి, మిర్చి, పత్తి, అరటి, శనగ రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ఉల్లి ధర పూర్తిగా పతనమైంది. ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడంతోపాటు బస్తాకు అందనంగా వ్యాపారులు దోచుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బద్వేలు నియోజకవర్గ పరిధిలో దాదాపు లక్షా 50వేల ఎకరాల సాగు భూమి ఉంది. అందులో ప్రధానంగా వరి, మొక్క జొన్న, సజ్జ, అరటి, బొప్పాయి, జామ తదితర పంటలను సాగు చేస్తుంటారు. గత ఏడాది వరికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు నష్టాలబాట పట్టారు. తీరా పంట చేతికి వచ్చే సరికి ధాన్యానికి ధరలు లేక దళారులకు తక్కువ ధరకే విక్రయించుకోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం ఎకరా పంట సాగు చేయడానికి పంటను బట్టి రూ.35వేల నుండి రూ.80వేల వరకు ఖర్చవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు మరో రూ.15వేలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అరటి పంట ధర పూర్తిగా పతనమైంది. కిలో రూపాయి నుంచి కాయ సైజును బట్టి రూ.7 ధర పలుకుతోంది. దీంతో అరటి సాగు చేసిన రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నాడు అందుబాటులో ఎరువులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హాయంలో 2019–2024 వరకు ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులను అందించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిరీ్వర్యం చేసింది. అంతేగాకుండా యూరియా సక్రమంగా రైతులకు అందించలేని దుస్థితిలో ప్రస్తుత సర్కార్ ఉంది.
సాగు ఖర్చులు పెరిగాయి
ఎరువుల ధరలతోపాటు కూలి, వ్యవసాయ యంత్రాల బాడుగల ధరలు పెరిగాయి. దీంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. పంట సాగు చేసేకంటే కూలి పనులకు వెళ్లడం నయం అన్నట్లు పరిస్థితి నెలకొంది. ఉన్న భూమిని వదులుకోలేక వ్యవసాయం చేస్తున్నాం. ఎరువుల ధరలను తగ్గించాలి.
– జి.చిన్నశేషారెడ్డి, ఆకులనారాయణపల్లె, కాశినాయన మండలం
పంటలకు గిట్టుబాటు ధర లేదు
ఏ పంట సాగు చేసినా గిట్టుబాటు ధరలు లేవు. ఒక వైపు రైతులకు సాగు ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయాయి. గోరుచుట్టుపై రోకటి పోటులా ప్రభుత్వాలు ఎరువుల ధరలను పెంచడం దారుణం. రైతుల పరిస్థితి దీనంగా మారింది. వ్యవసాయం చేయడం కష్టంగా ఉంది.
– డి.రామచంద్రారెడ్డి, కేఎన్ కొట్టాల, కాశినాయన మండలం


