కళ్యాణదుర్గంలోని కర్ణాటక బ్యాంక్ వద్ద ఆధార్ కోసం వేచి ఉన్న జనం
ఆధార్ క్యాంపుల్లో అంతంత మాత్రంగా సర్వీసులు
సమస్యలతో ప్రజలు సతమతం
చోద్యం చూస్తున్న అధికారులు
ఈ చిత్రంలో కన్పిస్తున్నది మంజన్న, తిప్పమ్మ దంపతుల కుటుంబం. వీరిది శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. వీరికి పిల్లలు శృతి, గంగోత్రి, గీత, హనుమంతు, వర్దన్ ఉన్నారు. అమ్మ గంగమ్మ, చెల్లి రంగమ్మతో కలిపి మొత్తం తొమ్మిది మంది కటుంబసభ్యులు ఉన్నారు. ఈ కుటుంబం గత 20 ఏళ్లుగా శెట్టూరులో నివాసం ఉంటుంన్నారు. వీరి వృత్తి వెంట్రుకల వ్యాపారం. సొంత ఇల్లు లేదు. 
ఇందులో ఒక్కరికీ ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కోర్డు నమోదు కోసం ఏళ్ల తరబడి ప్రతి అధికారి చుట్టు తిరిగారు. ఆధార్ కార్డులు లేకపోవడంతో 12 ఏళ్ల శృతి, 10 ఏళ్ల గంగోత్రి, 8 ఏళ్ల గీతను ఏ పాఠశాలలోనూ చేర్చుకోవడం లేదు. ఆధార్ కార్డులు లేక హనుమంతు, వర్దన్ పేర్లు అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు లేదు. ఇలా పిల్లల భవిష్యత్ అంధకారం కాగా, అమ్మ గంగమ్మ (వితంతువు) 60 ఏళ్లు దాటినా పెన్షన్ రావడం లేదు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే కారణంతో ఎక్కడకు వెళ్లినా ఆధార్ నమోదు చేయడం లేదు.
శెట్టూరు: కళ్యాణదుర్గం నియోజవర్గంలోని ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో సర్వీసులు సక్రమంగా అందడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పీ, కంబదూరు మండలాల్లో 76 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో ఆధార్ సేవలు అందించేదుకు అవకాశాలున్నాయి. అయితే అధికారుల నిర్లక్ష్యంతో నియోజవర్గంలో కేవలం ఆరు సచివాలయాల్లో ఆధార్ సర్వీసులు అందిస్తున్నారు.
అదీ మండలానికి ఒక్కటే సచివాలయం కాగా బ్రహ్మసముంద్రంలో అసలే లేదు. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ల నిర్లక్ష్యంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. నియోజవర్గంలోని శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పీ, కంబదూరు మండలాలు కర్ణాటక సరిహద్దు కావడంతో ఎక్కువ శాతం వివాహాలు, జననాలతో పాటు వలసలు ఎక్కువగానే ఉంటాయి. దీంతో ఈ మండలాల్లో ఆధార్ సమస్యలు కుప్పలు తెప్పలుగా పడివున్నాయి.
విద్యార్థుల ఆపార్ కార్డు కోసం, గర్భిణుల, బాలింతలు అంగన్‌వాడీలలో పేస్ యాప్ కోసం, చిన్నపిల్లలు అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు కోసం, వయోజనులు, వృద్ధులు సంక్షేమ పథకాల కోసం ఆధార్‌కార్డులు తప్పనిసరి. నూతన ఆధార్ నమోదు, ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు తదితరర్ సమస్యలతో ప్రజలు కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు కర్ణాటక ప్రాంతంలోని ప్రైవేటు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు, కూలీలు పని మానుకుని వెళ్తున్నా సమస్య పరిష్కారం కాక అవస్థలు పడుతున్నారు.
గ్రామంలో ఏర్పాటు చేయాలి
నా కుమారుడుకి మూడేళ్లు. ఇప్పటికే రెండు సార్లు ఆధార్ కార్డు తీయించాను. సమస్య ఏమో తెలియదుకాని రిజెక్ట్ అయింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రంలో ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ సర్వీస్ కేంద్రం మా మండలంలో ఎక్కడా లేదు. కళ్యాణదుర్గం లేక రాయదుర్గం వెళ్లాల్సి వస్తోంది. పనులు మానుకుని పిల్లాడిని తీసుకువెళ్లాలి. అది కూడా ఒక రోజు పడుతుందో.. రెండు రోజులు పడుతుందో తెలియదు. మాలాంటి పేదలకు ఖర్చుతో కూడుకున్న పని. మా గ్రామంలోని సచివాలయంలో ఆధార్ సర్వీసులు ఇస్తే బాగుంటుంది.
– రాజేశ్వరి, పడమటి కోడిపల్లి, బ్రహ్మసముద్రం మండలం


