డిక్సన్ పరిశ్రమలో కొలువులు సాధించిన వారితో మాట్లాడుతున్న అప్పటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
వైఎస్ జగన్ హయాంలో పారిశ్రామికీకరణతో ఉద్యోగాల వెల్లువ
సచివాలయ వ్యవస్థతో భారీగా ఉద్యోగాల నియామకం
విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం
రిమ్స్, మెడికల్ కళాశాలలు, అర్బన్ హెల్త్‌సెంటర్‌లలో ఉద్యోగాలు
చంద్రబాబు సర్కార్‌లో తిరోగమనంలో వైఎస్సార్ కడప జిల్లా
చంద్రబాబు సర్కారు కొలువుదీరింది... కొలువులకు నిలువునా కోత పడింది. ‘ఉపాధి’ మాటే మరుగునపడింది.. పారిశ్రామికీకరణ పట్టాలు తప్పి... జిల్లా ప్రగతి దిశ మార్చుకుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి శ్రీకారం చుట్టగా... చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లింది. ఉపాధి, ఉద్యోగాలు కరువై జిల్లా తిరోగమనంలో పయనిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కడప: కరువు సీమ కడప గడపలో విద్యార్థులు, నిరుద్యోగులు విద్య, ఉద్యోగాల కోసం వలసలు వెళ్లకూడదన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగ విప్లవానికి నాంది పలికింది. జిల్లాలో పరిశ్రమలతో పాటు.. ఉన్నత విద్యాసంస్థలు నిర్మించి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో భారీపరిశ్రమలు కొలువుదీరాయి. ఇందులో ఒక్క డిక్సన్ కంపెనీలోనే దాదాపు 1300 మంది ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగా, బద్వేలు సమీపంలో ఏర్పాటు చేసిన సెంచురీ ఫ్లైబోర్డ్స్‌సంస్థలో దాదాపు 2,078 మంది స్థానికులైన నిరుద్యోగులు అవకాశాన్ని దక్కించుకున్నారు.
వీటితో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, యోగివేమన విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలతో పాటు, పులివెందుల మెడికల్ కళాశాల, రిమ్స్, మానసిక వైద్యశాల, క్యాన్సర్ హాస్పిటల్స్‌లో నియామకాల ప్రక్రియ చేపట్టింది. వైఎస్‌ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్‌ల ఏర్పాటుతో వైద్యుల నియామకం, సహాయ సిబ్బంది ఏర్పాటుతో సేవలు దగ్గరయ్యా యి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తూ వచ్చిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఒకగూటి కిందికి తీసుకువచ్చి వారందరినీ ఆప్కాస్ కింద చేర్చి ఉద్యోగభద్రత కల్పించిన విషయం తెలిసిందే.
గ్రామసచివాలయాల ఏర్పాటుతో ఉద్యోగ విప్లవం..
గ్రామస్వరాజ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది. వీటి నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మందికి ఏకకాలంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఒక చరిత్ర. ఇక జిల్లాలో 645 సచివాలయాల పరిధిలో 5,400 మంది సచివాలయ కార్యదర్శులుగా కొలువులు సాధించారు. వీటికి అనుబంధంగా సేవలందించేందుకు ప్రతి 50 ఇళ్లకు గ్రామవలంటీర్లు ఏర్పాటు చేశారు.
టీడీపీ సర్కార్‌లో తిరోగమనం...
జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తే టీడీపీ సర్కార్ తిరోగమనంలో పడేసింది. పులివెందుల మెడికల్ కళాశాల అందుకు ప్రత్యక్ష నిదర్శనం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2024–25 విద్యాసంవత్సరానికే 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించింది. మంజూరైన ఎంబీబీఎస్ సీట్లను తిరస్కరించి, ఈ ప్రాంతంపై సీఎం చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేశారు.
అప్పట్లో అంగీకరించింటే 2025–26 ఏడాదికి మరో 150 ఎంబీబీఎస్ సీట్లు లభించేవి. తద్వారా పేద ప్రజలు, పేద విద్యార్థుల భవిష్యత్ యోగ్యకరంగా ఉండేది. మెడికల్ కళాశాల అటుంచితే, అందులో ఉన్న ఆధునాతన పరికరాలు సైతం తరలించుకువెళ్లడం మరో విశేషం. కడప అంటే కడుపు మంట చంద్రబాబు సర్కార్‌కు ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి ఏడాదిన్నర్రగా శూన్యం.
మరో వైపు డీఎస్సీ పేరుతో సరికొత్త ప్రచార ఆర్భాటానికి తెరలేపారు. డీఎస్సీ అభ్యర్థులందర్నీ విజయవాడకు పిలిపించి ‘షో’చేశారు. మెరిట్ ప్రాతిపదికగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌లో 1.25 లక్షల మందికి ఉద్యోగాలు ఏకకాలంలో లభించాయి. నియామకపత్రాలు అందుకొని ఎక్కడివారు అక్కడే బాధ్యతల్లో చేరిపోయారు. నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం క్షేత్రస్థాయి ఆచరణలో నిమగ్నం కాగా, నేడు చంద్రబాబు సర్కార్ ఫించన్లు పంపిణీ నుంచి ప్రచార యావే ధ్యేయంగా వ్యవహరిస్తోండడం గమనార్హం.
నిరుద్యోగ యువతకు అండగా వైఎస్ జగన్
వైఎస్సార్ సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగ యువతకు అండగా నిలబడ్డారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. జిల్లాలోని వైవీయూ, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న అనేక పోస్టులను భర్తీ చేశారు. అంతేకాకుండా వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ఫ్లైవుడ్ పరిశ్రమతోపాటు కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన వివిధ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకున్నారు.
– నన్నయ్య,ప్రకాశ్‌నగర్, కడప
నిరుద్యోగులను పట్టించుకోని కూటమి సర్కార్
రాష్ట్రంలోని కూటమి సర్కార్ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతితోపాటు లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి మాటే లేకపోగా, అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకు వస్తున్నామని చెబుతున్నారేగానీ క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలు కనుచూపు మేరలో కానరావడం లేదు. మొత్తం మీద చంద్రబాబు హయాంలో నిరుద్యోగ యువతకు ఇబ్బందులు తప్పేలా లేవు.
– షేక్ మన్సూర్, లక్కిరెడ్డిపల్లె, సీకే దిన్నె మండలం


