బాధితులకు సత్వర న్యాయాన్ని అందించాలి
ప్రొద్దుటూరు క్రైం: బాధితులకు సత్వర న్యాయాన్ని అందిండచమే కోర్టుల కర్తవ్యమని హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ దిశగా న్యాయమూర్తులందరూ కృషి చేయాలన్నారు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలను అందించి ఇటీవల మృతి చెందిన ఎస్.కృష్ణారెడ్డి, ఎల్.తులసిరెడ్డి చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ప్రొద్దుటూరు కోర్టు ఆవరణలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి, న్యాయవాది అన్నపూర్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కోర్టు ఆవరణలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి దంపతులకు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ కార్యాలయం, న్యాయవాదుల గుమాస్తాల అసోసియేషన్ కార్యాలయాన్ని వారు సందర్శించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. సీనియర్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, తులసిరెడ్డిల చిత్రపటాలను వారి కుటుంబ సభ్యులతో కలసి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి దంపతులు ఆవిష్కరించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి సుదీర్ఘకాలం పాటు న్యాయవాదిగా సేవలు అందించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. తులసిరెడ్డి ఎస్‌కే యూనివర్సిటీలో చదివారని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది మెట్టుపల్లి సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి మనవడు డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కృష్ణారెడ్డి, తులసిరెడ్డి సేవలు, వారితో తమ అనుభవాల గురించి పలువురు సీనియర్ న్యాయవాదులు వివరించారు. జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రొద్దుటూరు న్యాయవాదులు, కృష్ణారెడ్డి, తులసిరెడ్డి కుటుంబసభ్యులు జస్టిస్ శ్రీనివాసరెడ్డి దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సీ యామిని, న్యాయవాదులు శ్యాంసుందర్‌రెడ్డి, దాదాహయ్యత్, ముడిమేల కొండారెడ్డి, గొర్రెశ్రీనివాసులరెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, ఎల్ గంగిరెడ్డి, జింకా విజయలక్ష్మి, లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
హాజరైన జిల్లాలోని న్యాయమూర్తులు... న్యాయవాది కృష్ణారెడ్డి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి దంపతులు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్
కె.శ్రీనివాసరెడ్డి
బాధితులకు సత్వర న్యాయాన్ని అందించాలి


