ఆగని వేధింపులు!
వ్యవస్థలతో హడావుడి
● మదనపల్లె ఆర్డీవో కార్యాలయ దగ్ధం కేసులో అక్రమ అరెస్ట్‌లకు కుట్రలు
● ఒక ఘటన..దారి మళ్లిన దర్యాప్తు
మదనపల్లె ఆర్డీవో కేసులో సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించారు. ఒక ఘటనపై సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పదేపదే అబద్ధాలు.. ఘటన జరిగిన మరుసటిరోజు 2024 జూలై 22న డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌లను హెలికాప్టర్‌లో మదనపల్లెకు పంపారు. తర్వాత అగ్నిప్రమాదంగా నమోదైన కేసు మారిపోయింది. దర్యాప్తు తీరే మారిపోయింది. వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలో సోదాలు చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీలు వెబ్‌సైట్‌లో కనిపించకుండా కట్టడి చేశారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి సీసోదియా మదనపల్లెలో మకాంపెట్టి హడావుడి చేశారు. ఘటన జరిగి ఇంతకాలమైనప్పటికీ ప్రభుత్వం ఆరోపించినట్టుగా 22ఏ భూముల వ్యవహరంకాని, ఇతర ఆరోపణలపై ఒక్క ఆధారాన్ని బయటపెట్టలేకపోయింది.
మదనపల్లె: మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో 2024 జూలై 21న జరిగిన ప్రమాద ఘటన, తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే లక్ష్యంగా సాగిన వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. రాజకీయ కారణాలతో ప్రజల్లో బలమైన మద్దతు కలిగిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా బలహీనం చేయాలన్న చంద్రబాబు వ్యూహాలు ప్రతి అంశంలోనూ బెడిసికొడుతూనే ఉన్నాయి. ఆర్డీవో కార్యాలయ ఘటన వెనుక వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఆరోపణలు చేసినా..ఆ ఆరోపణ లను రుజువు చేయలేక..ప్రభుత్వం మళ్లీ వేధింపులకు పాల్పడుతోంది. దీనికి శనివారం తెల్లవారుజాము మదనపల్లె వైఎస్సార్‌సీపీ నేత మాధవరెడ్డి ఇంటివద్ద సీఐడి అధికారుల బృందం ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రావడమే నిదర్శనం. న్యాయస్థానం నుంచి ఆయనకు రక్షణ ఉన్నప్పటికీ, చట్టనిబంధనలు పాటించాలన్న సూచనను పెడచెవిన పెట్టారు.
ఉన్నాడనే వచ్చారు
మాధవరెడ్డిని అరెస్ట్ చేయడం కోసం తిరుపతినుంచి సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ బృందం శనివారం తెల్లవారుజామునే మదనపల్లె చేరుకుంది. మాధవరెడ్డి ఇంటికి వచ్చాక తాళం వేసి ఉండటంతో ఎక్కడున్నాడంటూ ఆరా తీశారు. రెండుగంటల దాకా ఇంటి ఆవరణలోనే వేచి చూశాక వెనుదిరగాల్సి వచ్చింది. ఇదే ఇంటిపైన అద్దెకు ఉంటున్న వారితో మాధవరెడ్డి సమాచారం కోసం ప్రయత్నించినా లభ్యం కాకపోవడంతో వెనుదిరిగా వెళ్లారు. కాగా ఆయన ఇంటిలో ఉంటాడన్న సమాచారంతో అరెస్ట్ చేసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్డీవో కార్యాలయ ఘటన కేసులో బబెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై వచ్చే మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారంటే వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో స్పష్టం అవుతోంది.
మదనపల్లె ఆర్డీవో కార్యాలయ ఘటనతో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరులను వేధించాలన్న లక్ష్యంతో పోలీసు అధికారులు ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ ఘటనతో సంబంధం, ప్రమేయం లేని వాళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఆర్డీవో కార్యాలయ ఘటన తర్వాత మొదటగా మదనపల్లెలో ఉంటున్న మాధవరెడ్డి ఇంటిపై దాడులతో తనిఖీలు మొదలు పెట్టారు. ఆయనింటిలో లభించిన జిరాక్స్ కాపీలను వదలకుండా తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేశారు. తర్వాత మున్సిపల్ వైస్‌చైర్మన్ జింకా వెంకటా చలపతి, బాబ్‌జాన్, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, హైదరాబాద్‌లో ఉంటున్న శశికాంత్, తుకారాం తిరుపతి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎవరి ఇళ్లలో సోదాలు చేశారో వారందరిపైనా కేసులు నమోదు చేశారు. తద్వారా వేధింపులు తీవ్రం చేశారు.
ఆగని వేధింపులు!


