ఆమదాలవలస: మీడియా సమావేశాల్లో తనపై అనుచిత వాఖ్యలు చేసిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ పోలీసులను కోరారు. ఆయన ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమదాలవలస పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కూన రవి దయాదాక్షిణ్యాల మీద తనకు డిగ్రీ సర్టిఫికెట్లు వచ్చాయని చెబుతున్నారని, తనను ఉద్దేశించి ‘నా చెప్పుతో సమానం’ అని వ్యాఖ్యానించారని, వైఎస్సార్‌సీపీ క్యాడర్ బట్ట కట్టేవారు కాదు, తిండి తినేవారు కాదంటూ ఆగస్టు 18న మీడియా ముఖంగా అనుచితంగా మాట్లాడారని చింతాడ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలకు, తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదన్నారు.


