సంతకాలతో సమరం
అవి కేవలం సంతకాలు కాదు.. ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతాలు. అవి కేవలం అభిప్రాయాలు కావు.. నిరంకుశత్వంపై జనమెత్తిన ఆయుధాలు. ప్రజల గుండెల్లో రగులుతున్న బాధను సర్కారుకు చెప్పడానికి, ప్రైవేటీకరణతో వచ్చే అనర్థాలను అన్ని వర్గాలకు వివరించడానికి వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ చేపడుతోంది. నాయకుల నుంచి సామాన్యుల వరకు, మేధావుల నుంచి విద్యార్థుల వరకు అందరినీ ఈ క్రతువులో భాగస్వాములను చేస్తోంది. జిల్లాలో సంతకాల సేకరణ ఉత్సాహంగా జరుగుతోంది.
పేద, సామాన్య వర్గాల వారికి వైద్య విద్య, వైద్యం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిలో కొన్ని నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేశారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నింది. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ–కోటి సంతకాల సేకరణ ఉత్సాహంగా జరుగుతోంది. టెక్కలి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6న గ్రామాల్లో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లో సైతం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల భవిష్యత్‌లో కలిగే నష్టాలను వివరించారు. నవంబర్ 12న టెక్కలిలో ప్రజాఉద్యమాన్ని నిర్వహించారు. దీంతో అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైన మద్దతు కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా కూడా ఎచ్చెర్లలో ఆదివారం వరకు 48000 సంతకాలు పూర్తి చేశారు. పాతపట్నంలో 48వేలు, నరసన్నపేట నియోజకవర్గంలో 42500, ఇచ్ఛాపురంలో 35,000, ఆమదాలవలస నియోజకవర్గంలో ఇంతవరకు 42,000 సంతకాలు సేకరించారు. టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 40,000 వరకు జరిగాయి. పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో 35వేలు దాటాయి.
–టెక్కలి


