సఖినేటిపల్లి: గోదావరి నదిలో ఓ పంటుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య వశిష్ట గోదావరి నదిపై పంటు మీద ప్రతి రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం నర్సాపురం నుంచి సఖినేటిపల్లి వైపు సుమారు 80 మంది ప్రయాణికులు, 20 వాహనాలతో పంటు బయలుదేరింది.
నది మధ్యలోకి చేరిన తరువాత ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పంటు నది మధ్యలోనే నిలిచిపోయింది. దీనికి తోడు సముద్ర ఆటుపోట్ల కారణంగా గోదావరిలోకి బలంగా వస్తున్న కెరటాల ధాటికి పంటు వేగంగా సయ్యాటలాడుతూ దిశ మారింది. అందులో పిల్లలతో ఉన్న ప్రయాణికులు అరగంట పాటు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పంటుకు తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు నిర్వాహకులు విఫలయత్నం చేశారు.
కొద్దిసేపటికి అదే రేవు నుంచి ప్రయాణికులతో వస్తున్న మరో పంటుకు తాడు కట్టి, మొరాయించిన పంటును సఖినేటిపల్లి వైపు గోదావరి ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్న రేవులో పంటు సామర్థ్యం, నిర్వహణలో అ«దికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


