సాక్షి, అమరావతి: ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు శనివారం అర్ధరాత్రితో ముగిసింది. దేశంలో సుమారు 9 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు అంచనా వేయగా.. ఈ ఆరు నెలల గడువులో 5,17,082 వక్ఫ్ ఆస్తులనే ముతవల్లీలు, నిర్వాహకులు నమోదు చేశారు. వీటికి వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ పరిశీలన తర్వాత.. వక్ఫ్ బోర్డు సీఈవో ఆమోదం తెలిపే ప్రక్రియ సగమే పూర్తయ్యింది.
దీంతో ఇప్పటి వరకు 2,16,937 ఆస్తులకు మాత్రమే తుది ఆమోదం లభించింది. ఇప్పటికే అప్‌లోడ్ పూర్తి చేసిన ఆస్తుల పరిశీలన.. ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల వెసులుబాటు కల్పించింది. దీంతో వక్ఫ్ బోర్డుల ముతవల్లీలు, నిర్వాహకులు అప్‌లోడ్ చేసిన ఆస్తులను ఆమోదించేందుకు ఈ మూడు నెలల గడువు ఉపయోగపడనుంది.
ట్రిబ్యునల్‌పైనే ఆశలు..
ఉమీద్ పోర్టల్‌లో నమోదు గడువు ముగియడంతో.. దేశంలోని 4 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తుల నమోదు ప్రశ్నార్థకంగా మారింది. సాంకేతిక కారణాల వల్ల చాలా రాష్ట్రాల్లో ఆస్తుల నమోదు సరిగ్గా జరగలేదు. దీంతో వక్ఫ్ సవరణ చట్టంలోని వెసులుబాటును ఉపయోగించుకుని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు ఆయా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.
ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తే వక్ఫ్ ఆస్తుల నమోదుకు మరో 6 నెలల గడువు లభిస్తుందని.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఏపీ ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ‘సాక్షి’కి చెప్పారు. ఉమీద్ పోర్టల్ క్లోజ్ అయినందున.. ముస్లిం సమాజానికి ఉన్న ఏకైక మార్గం ట్రిబ్యునల్ మాత్రమేనని తెలిపారు.
కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు కేంద్రంగా ఉన్న ట్రిబ్యునల్‌కు శాశ్వత జడ్జిని నియమించలేదని చెప్పారు. దీని వల్ల వారంలో ఒక రోజు మాత్రమే ట్రిబ్యునల్ పనిచేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు వెంటనే ట్రిబ్యునల్‌కు శాశ్వత జడ్జిని నియమించాలని మునీర్ అహ్మద్ డిమాండ్ చేశారు.


