హెచ్చెల్సీకి గండి
● ఉంతకల్లు వద్ద కుడిగట్టు
చెదిరిపోవడంతో వాగులోకి నీరు
● నీటిమట్టం తగ్గించి
యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేత
బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి పెద్ద ప్రమాదం తప్పింది. బొమ్మనహాళ్ హెచ్చెల్సీ సెక్షన్ పరిధిలోని ఉంతకల్లు వద్ద హెచ్చెల్సీకి 113–557 కిలోమీటర్ పెద్ద కుడి గట్టుకు అకస్మాత్తుగా ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో పెద్ద గండి పడింది. దీంతో ఒక్కసారిగా కాలువ నుంచి 70 నుంచి 90 క్యూసెక్కుల నీరు వాగులో వెళ్లాయి. వాగులోంచి ఉద్దేహాళ్, ఉంతకల్లు గ్రామాల ఆయకట్టు భూముల్లో సాగు చేసిన వరి పంట పొలాల్లోకి నీరు చేరింది. పంట కోత సమయలో ఇలా జరగడంతో ఆందోళనకు గురైన రైతులు వెంటనే హెచ్చెల్సీ అధికారులకు సమాచారం అందించారు. కణేకల్లు సబ్ డివిజన్ డీఈఈ దివాకర్‌రెడ్డి, సరిహద్దు డీఈఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఈఈలు అల్తాఫ్, రంజిత్‌కుమార్ సిబ్బందితో కలిసి గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. నీటి మట్టాన్ని సరిహద్దులో 400 క్యూసెక్కులు తగ్గించి గండి పూడ్చేందుకు జేసీబీ, ఇటాచీలతో చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు గండిని పూర్తిగా మూసివేసి కాలువ నుంచి నీరు వాగులోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. హెచ్చెల్సీ సరిహద్దులో ఎక్కువ స్ధాయిలో నీరు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని డీఈఈ దివాకర్‌రెడ్డి తెలిపారు. కాలువలో 1,600 క్యూసెక్కులు రావాల్సి ఉండగా.. ఒకేసారి 2 వేల క్యూసెక్కుల నీరు రావడంతో కాలువ కుడి గట్టుకు గండి పడిందని స్పష్టం చేశారు. గండి పెద్దది కాకముందే పూడ్చి వేశామన్నారు.


