తెగిన పీఏబీఆర్ కుడికాలువ గట్టు
కూడేరు: జల్లిపల్లి వద్ద ఆదివారం వేకువ జామున పీఏబీఆర్ కుడి కాలువ గట్టు తెగింది. నీరంతా పెద్ద ఎత్తున పంట పొలాల్లోకి ప్రవహించింది. విషయాన్ని రైతులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈఈ శశిరేఖ, డీఈ కవిత, జేఈ ఓబులు రెడ్డి, తహసీల్దార్ మహబూబ్ బాషా తెగిన గట్టును పరిశీలించారు. డ్యాం దగ్గర ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద కుడి కాలువకు నీరు వెళ్లకుండా మిడ్‌పెన్నార్ డ్యాంకు వెళ్లేలా మళ్లించారు. గేట్లు బంద్ చేస్తే మళ్లీ స్తంభిస్తాయని అధికారులు నీటి మళ్లింపు చేపట్టారు. దీంతో కుడి కాలువకు నీటి సరఫరా ఆగింది. గట్టుకు మరమ్మతు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
అధికారుల అలసత్వం.. రైతుల పాలిట శాపం
ఏడాడి క్రితం బోర్‌వెల్ లారీ కుడి కాలువ గట్టుపై వెళ్లినపుడు ఆ బరువుకు గట్టు కిందికి కుంగింది. దీంతో లారీ ఇరుక్కుపోయింది. అప్పుడు అధికారులు గట్టుకు తూతూ మంత్రంగా మరమ్మతులు చేపట్టడంతోనే ప్రస్తుతం గట్టు నీటి ప్రవాహానికి కోతకు గురైంది. నీటి విడుదలకు ముందు కాలువ భద్రతను అధికారులు పర్యవేక్షించలేదు. కాలువలో పెరిగిపోయిన కంప చెట్లు తొలగించిందీ లేదు. అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. నీటి ప్రవాహానికి వేరుశనగ, కంది, వరి, చీనీ పంట పూర్తిగా దెబ్బతిన్నాయి. నీటితో పాటు మట్టికొట్టుకునిపోవడంతో బావులు, బోర్లు పూడిపోయాయి. మోటర్లు, స్టార్టర్ పెట్టెలు కొట్టుకుపోయాయి. రూ.కోటి వరకు నష్టం వాటిల్లింది.


