దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది
విజయం సాధించాలనే సంకల్పం ఉంటే క్రీడలు, చదువులో రాణించడానికి పేదరికం ఎన్నడూ అడ్డంకి కాదు. ఉమ్మడి జిల్లాకు చెందిన బోయ బాబు విషయంలో ఇది నిజమని తేలింది. కడు పేదరికం నుంచి వచ్చి... ఆర్టీటీ సహకారంతో ఓ వైపు చదువులు, మరో వైపు క్రీడల్లో రాణిస్తూ నేడు జిల్లా గర్వించే క్రీడాకారుడిగా ఎదిగిన బోయ బాబు విజయ ప్రస్తానం ఆయన మాటల్లోనే... – పుట్టపర్తి అర్బన్:
మాది అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అమ్మ ఓబులమ్మ వ్యవసాయ కూలి పనులకు పోతోంది. నాన్న చెన్నప్ప కంకర రాళ్లు కొట్టే పనికి పోతుంటాడు. రోజంతా వారు కష్టపడితే తప్ప కుటుంబం గడిచేది కాదు. రాళ్లు కొట్టే క్రమంలో నాన్న, వ్యవసాయ కూలి పనుల్లో అమ్మ తరచూ గాయపడేవారు. అయినా ఆ బాధ నాకు తెలియకుండా వారు నన్ను పెంచారు. ఎలాగైనా బాగా చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి అమ్మానాన్న ను బాగా చూసుకోవాలని అనుకున్నా.
ఆటనే ఈ స్థాయికి చేర్చింది
పేదరికం కారణంగా నాకు చదువులు, ఉద్యోగ అవకాశాలు ఉండవని అనుకున్నా. ఈ బాధను మరచిపోయేలా పరుగు తీయడం మొదలు పెట్టా. ఈ క్రమంలోనే బంతిని కాలితో కంట్రోల్ చేస్తూ నా స్నేహితులకు అందకుండా పరుగు తీస్తుండడం గమనించిన టీచర్లు నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో ఆర్డీటీ సంస్థ దేవుడిలా ఆదుకుంది. ఫుట్‌బాల్ అకాడమీలో చేర్చుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న సెయింట్ విన్సెంట్ డీపాల్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సహించింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అక్కడే చదువుకున్నా. తిరిగి ఆర్డీటీ సహకారంతోనే అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో ఆ ట్రస్ట్ విద్యాసంస్థలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నా. కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, పీడీ శ్రీనివాసులు నన్నెంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
ఫుట్‌బాల్‌లో రాణిస్తున్న బోయ బాబు జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యం
దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది


