బోర్లు తవ్వేందుకు సిద్ధంగా ఉన్న రిగ్గులు
- అడుగంటుతున్న భూగర్భజలాలు
- లబోదిబోమంటున్న ప్రజలు
పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గంలో విచ్చలవిడిగా బోర్లు తవ్వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా బోర్లు తవ్వుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో భూగర్భజలాల అడుగంటే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన రిగ్గులను లీజుకు తీసుకున్న కొందరు వ్యక్తులు నియోజకవర్గంలో బోర్లు తవ్వుతున్నారు. అయితే లీజుకున్న తీసుకున్న వారిలో కూటమి నాయకులు అధికంగా ఉండటంతో అధికారులు చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. రోజూ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 300 అనధికార బోర్లు తవ్వుతున్నట్లు సమాచారం.
అమలుకు నోచుకోని వాల్టా చట్టం
భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన వాల్టా చట్టం అమలుకు నోచుకోవడం లేదు. నిబంధనల ప్రకారం బోరు తవ్వాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. అయితే దళారులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇస్తుండటంతో వారి పని సులువు అవుతున్నట్లు తెలుస్తోంది. పగలు పాయింట్ చూసుకుని రాత్రికి రాత్రే బోరు తవ్వేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా పట్టణాల్లో కొత్తగా ఇళ్లు నిర్మించే వారు దళారులు అడిగినంత సొమ్ము ముట్టజెప్పి బోర్లు తవి్వంచుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బోర్లు ఎండిపోయి కనీసం ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందు పడే పరిస్థితి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
నగర పంచాయతీకి తాగునీటి గండం..
విచ్చలవిడి బోర్ల తవ్వకాలతో పెనుకొండ నగర పంచాయతీకి తాగునీటి గండం పొంచి ఉంది. ఇప్పటికే జగనన్న కాలనీలో ప్రజలు తాగునీటి కోసం పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదు. ఎన్‌టీఆర్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, నారాయణమ్మ కాలనీ పైభాగంలోనూ, న్యూకాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరించకపోవడం వల్ల సమస్య రోజురోజుకు జటిలంగా మారుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతి లేని బోర్ల తవ్వకాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తప్పవు
పెనుకొండ మండలంలో అనుమతులు లేకుండా బోర్లు వేస్తే తగిన చర్యలు చేపడుతాం. రిగ్గులను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తాం. ఈ మేరకు ఆయా గ్రామాల్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, సచివాలయ సిబ్బందిని అలర్ట్ చేస్తాం. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిప్తే ఉపేంక్షించం. ప్రజలు తమ ప్రాంతాల్లో ఎవరైనా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నట్లు తెలిస్తే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలి.
– స్వాతి, పెనుకొండ తహసీల్దార్


