దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది | - | Sakshi
Sakshi News home page

దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది

Dec 8 2025 8:00 AM | Updated on Dec 8 2025 8:00 AM

దృఢ స

దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది

విజయం సాధించాలనే సంకల్పం ఉంటే క్రీడలు, చదువులో రాణించడానికి పేదరికం ఎన్నడూ అడ్డంకి కాదు. ఉమ్మడి జిల్లాకు చెందిన బోయ బాబు విషయంలో ఇది నిజమని తేలింది. కడు పేదరికం నుంచి వచ్చి... ఆర్టీటీ సహకారంతో ఓ వైపు చదువులు, మరో వైపు క్రీడల్లో రాణిస్తూ నేడు జిల్లా గర్వించే క్రీడాకారుడిగా ఎదిగిన బోయ బాబు విజయ ప్రస్తానం ఆయన మాటల్లోనే...
– పుట్టపర్తి అర్బన్‌:

మాది అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అమ్మ ఓబులమ్మ వ్యవసాయ కూలి పనులకు పోతోంది. నాన్న చెన్నప్ప కంకర రాళ్లు కొట్టే పనికి పోతుంటాడు. రోజంతా వారు కష్టపడితే తప్ప కుటుంబం గడిచేది కాదు. రాళ్లు కొట్టే క్రమంలో నాన్న, వ్యవసాయ కూలి పనుల్లో అమ్మ తరచూ గాయపడేవారు. అయినా ఆ బాధ నాకు తెలియకుండా వారు నన్ను పెంచారు. ఎలాగైనా బాగా చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి అమ్మా, నాన్నను బాగా చూసుకోవాలని అనుకున్నా.

ఆటనే ఈ స్థాయికి చేర్చింది

పేదరికం కారణంగా నాకు చదువులు, ఉద్యోగ అవకాశాలు ఉండవని అనుకున్నా. ఈ బాధను మరచిపోయేలా పరుగు తీయడం మొదలు పెట్టా. ఈ క్రమంలోనే బంతిని కాలితో కంట్రోల్‌ చేస్తూ నా స్నేహితులకు అందకుండా పరుగు తీస్తుండడం గమనించిన టీచర్లు నన్ను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇలాంటి సమయంలో ఆర్డీటీ సంస్థ దేవుడిలా ఆదుకుంది. ఫుట్‌బాల్‌ అకాడమీలో చేర్చుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న సెయింట్‌ విన్సెంట్‌ డీపాల్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సహించింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అక్కడే చదువుకున్నా. తిరిగి ఆర్డీటీ సహకారంతోనే అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశా. ప్రస్తుతం పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సహకారంతో ఆ ట్రస్ట్‌ విద్యాసంస్థలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నా. కళాశాల ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు, పీడీ శ్రీనివాసులు నన్నెంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నారు.

మైదానంలో కీలకం

ఫుట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్న బోయ బాబు

జాతీయ స్థాయిలో పోటీల్లో ఏపీ జట్టు తరఫున ప్రాతినిథ్యం

ఫుట్‌బాల్‌ మైదానంలో లెఫ్ట్‌ వింగ్‌ బ్యాక్‌లో ప్రధానంగా ప్రత్యర్థి క్రీడాకారులను డిఫెన్స్‌ చేస్తూ అటాకింగ్‌లో సహాయపడుతుంటా. అలాగే లెఫ్ట్‌ కార్నర్‌ నుంచి బంతిని గోల్‌లోకి పంపే ముఖ్యమైన అటాకింగ్‌ స్థానం కూడా నాదే కావడం ఎంతో గర్వంగా ఉంది. ఆర్డీటీ ఫుట్‌బాల్‌ అకాడమీ, బెంగళూరు యూత్‌ ఫుట్‌బాల్‌ అకాడమీలో శిక్షణ పొందాను. 2016–17లో ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ టోర్నీలో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించా. 2017–20 వరకూ అస్సాం ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తరపున ఆడాను. 2022–23లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జట్టు తరఫున ఆలిండియా ఫుట్‌బాల్‌ టోర్నీలో ఆడి జట్టు విజయంలో కీలకంగా మారాను. 2023 నుంచి ఇప్పటి వరకూ ఎస్కే యూనివర్సిటీ తరఫున సౌత్‌జోన్‌ జట్టులో ప్రాతినిథ్యం వహిస్తున్నా. ఈ నెల 5 నుంచి విజయవాడ వేదికగా జరుగుతున్న సంతోష్‌ ట్రోఫీలో ఏపీ జట్టు తరఫున పాల్గొంటున్నా. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. ఇందుకు దాతలు ఎవరైనా సహకరించాలని కోరుకుంటున్నా.

దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది 1
1/2

దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది

దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది 2
2/2

దృఢ సంకల్పమే క్రీడాకారుడిగా మార్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement