ప్రోత్సాహం కరువైనా.. ఆదుకున్న మార్కెట్
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా... నేటికీ పట్టు రైతులకు ప్రోత్సాహకాలు అందలేదు. బైవోల్టిన్ పట్టుగూళ్లు ప్రతి కిలోపై రూ.50 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాల్సి ఉంది. ఈ 18 నెలల కాలంలో నయా పైసా కూడా ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలు రూ.90 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్‌లో గూళ్ల ధరలు పెరగడంతో పట్టు రైతులకు ఉపశమనం లభించింది.
మడకశిర: రాష్ట్రంలోనే బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా రైతులు ప్రథమ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం హిందూపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి తదితర పట్టుగూళ్ల మార్కెట్లలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఏడాది క్రితం కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.600 లోపే ఉండగా, ప్రస్తుతం రూ.800తో అమ్ముడు పోతోంది. కర్ణాటకలోని రామ్‌నగర్ మార్కెట్‌లో కిలో బైవోల్టిన్ పట్టుగూళ్ల ధర రూ.900కు పైగా పలుకుతోంది. దీంతో న్యాయబద్ధంగా తమకు అందాల్సిన ప్రోత్సాహాకాలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా.. మార్కెట్ తమను ఆదుకుటోందని పట్టు రైతులు పేర్కొంటున్నారు.
పట్టు రైతులకు ప్రోత్సాహకాలు
అందించని చంద్రబాబు ప్రభుత్వం
ధరల పెరుగుదలతో పట్టు రైతులకు దక్కిన ఊరట


