జిల్లాకు అందాల అతిథులు
అనంతపురం: వేలాది కిలోమీటర్ల దూరం నుంచి రివ్వున ఎగురుతూ వచ్చిన అందాల అతిథులు ఉమ్మడి జిల్లాలో సందడి చేస్తున్నాయి. ప్రకృతి సోయగాలను రెట్టింపు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇందులో బుల్లి పిట్ట ’ఉల్లంకి’ మొదలు, రంగురంగుల వివిధ జాతుల పక్షులు ఉన్నాయి. ఇప్పటికే స్థానికంగా 220 రకాల పక్షి జాతులను ఎస్కేయూలోని జువాలజీ విభాగం పరిశోధకులు గుర్తించగా... తాజాగా 32 జాతులకు చెందిన విదేశీ పక్షులు ఉమ్మడి జిల్లాలో సందడి చేస్తున్నట్లు నిర్ధారించారు. వీటి కిలకిలరావాలు, అందాలు, సందడి జిల్లా వాసులకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి.
ఆహారం.. సంతానోత్పత్తి కోసమే..
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగం పరిశోధన విద్యార్థుల సర్వే ప్రకారం ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వీటిలో రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 32 జాతులకు చెందిన వలస జాతి పక్షులు ఇప్పటికే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని చిత్రావతి, సంగమేశ్వరం, పెన్నా, హగరి నదీ తీరాలతో పాటు.. శింగనమల మండలం తరిమెల గ్రామ పరిసరాల్లో విడిది ఏర్పాటు చేసుకున్నాయి. కాగా, ఆయా దేశాల్లో శీతాకాలంలో తీవ్రమైన చలి నుంచి తప్పించుకోవడంతో పాటు సంతానోత్పత్తి కోసం ఈ పక్షులు వలస వచ్చినట్లుగా పరిశోధక విద్యార్థులు గుర్తించారు.
సందడి చేస్తున్న అరుదైన పక్షుల్లో కొన్ని
● సాండ్ పైపర్..
తెలుగులో ఉల్లంకి పిట్ట, చిట్టి తుర్రి అంటారు. యూరప్, మధ్య ఆసియా నుంచి వలస వచ్చాయి. నీటి అంచున బుడిబుడిగా నడుస్తూ పురుగులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.
●లిటిల్ స్టింట్..
తెలుగులో చిన్న ఉల్లంకి అని అంటారు. రష్యా, సైబీరియా ప్రాంతం నుంచి వలస వచ్చాయి. ఇవి కూడా నీటి అంచున సంచరిస్తూ కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.
●లిటిల్ రింగెడ్ ప్లోవర్..
తెలుగులో చిన్న వలయ ఉల్లంకి అంటారు. నీటి పరివాహక ప్రాంతాలు, వంకలు, వాగులతో పాటు మెట్ట ప్రాంతాల్లోనూ సంచరిస్తూ పురుగులు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.
● నార్తర్న్ పిన్‌టైల్ పక్షి (సూది తోక బాతు)..
ఇప్పటికే ధర్మవరం చెరువు, సంగమేశ్వరం, పెన్నా, చిత్రావతి, హగరి నదులతో పాటు తరిమెల గ్రామంలోని నీటి వనరుల్లో కనిపిస్తున్నాయి. నీటిలో ఈదుతూ జలచరాలను ఆహారంగా తీసుకుంటాయి.
● రోజీ స్టార్లింగ్..
దీనిని గులాబీ గోరువంక అని కూడా పిలుస్తారు. ప్రధానంగా పంటలకు నష్టం కలిగించే మిడతలు, పురుగులు, ఇతర కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో వీటిని రైతుల పాలిట మిత్రులుగా పరిగణిస్తారు.
ఉమ్మడి జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో విదేశీ పక్షుల సందడి
32 జాతులకు చెందిన విదేశీ పక్షుల రాక
స్థానికంగా 220 రకాల పక్షిజాతుల గుర్తింపు
ఫిబ్రవరి చివరి వరకు
కనువిందు చేయనున్న పక్షులు
పది రోజుల నిర్విరామ ప్రయాణంతో
13 వేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి కేవలం పది రోజుల్లోనే ఉమ్మడి జిల్లాకు విదేశీ పక్షులు చేరుకుంటాయి. రష్యా, సైబీరియా, ఆసియా ప్రాంతాల నుంచి సముద్రమట్టానికి 8 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ హిమాలయాల మీదుగా వలస వచ్చిన ఈ పక్షులు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉన్నాయి.
– డాక్టర్ వి.బాలసుబ్రహ్మణ్యం, జువాలజీ విభాగం అధ్యాపకుడు, ఎస్కేయూ
జిల్లాకు అందాల అతిథులు
జిల్లాకు అందాల అతిథులు
జిల్లాకు అందాల అతిథులు
జిల్లాకు అందాల అతిథులు


