వీడని ముగ్గురు మిత్రుల అదృశ్యం మిస్టరీ
రాప్తాడురూరల్: రాప్తాడు మండలం చిన్మయనగర్‌లోని ఎల్‌ఆర్‌జీ స్కూల్‌లో పదో తరగతి చదువుతూ అదృశ్యమైన ముగ్గురు స్నేహితుల మిస్టరీ నాలుగు రోజులవుతున్నా ఆచూకీ లభించలేదు. పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన ఎం.సుధీర్, తాడిపత్రి మండలం వంగనూరుకు చెందిన గంగుల దీపక్‌కుమార్, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం చెన్నమనాయనికోటకు చెందిన జి.ఆంథోని ప్రకాష్ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 5న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. సమీప ప్రాంతాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించింది. మరో బృందం బెంగళూరుకు వెళ్లింది.
ఆరోజు ఏమి జరిగిందంటే...
ముగ్గురు స్నేహితులు హాస్టల్‌లో ఉంటూ ఓ విషయంపై వాదనకు దిగి కారు అద్దాలు పగులకొట్టారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్లు చేసి విషయం చెప్పి వెంటనే వచ్చి మాట్లాడాలని చెప్పింది. తమ కుటుంబ సభ్యులు వస్తే ఎక్కడ ఇబ్బంది పడతామోననే భయంతో అదేరోజు ఇంటర్‌వెల్ సమయంలో తరగతి గది నుంచి వెళ్లిపోయారు. గుర్తించిన యాజమాన్యం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా లాభం లేకపోయింది. అదేరోజు రాప్తాడు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులు
అదృశ్యమైన ముగ్గురు స్నేహితుల్లో దీపక్‌కుమార్, ఆంథోని ప్రకాష్ ఇద్దరూ వారి తల్లిదండ్రులకు ఏకై క కుమారులు. మరో విద్యార్థి సుధీర్‌కు అన్న ఉన్నాడు. ఈ పిల్లలు మిస్సింగ్ అయ్యారని తెలిసిన రోజు నుంచి తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు. కూలినాలి చేసుకుంటూ ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలను చదివిస్తున్నామని వాపోతున్నారు. మూడు నెలల్లో వార్షిక పరీక్షలు ఉన్న సమయంలో ఇలా అదృశ్యం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆశలను అడియాసలు చేయొద్దని పిల్లలను వేడుకుంటున్నారు. తెలిసో తెలియకో చేసిన తప్పుగా క్షమిస్తామని, ఎక్కడున్నా వెంటనే తిరిగి రావాలని, చదువు ఇష్టం లేదంటే ఇంటికి రావాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు, స్కూల్ యాజమాన్యం ఓవైపు తిరుగుతుండగా, మరోవైపు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు కాళ్లరిగేలా ఊరూరు తిరుగుతున్నారు.
నాలుగు రోజులవుతున్నా ఆచూకీ లభించని వైనం
రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందం
తీవ్ర ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు


