వైభవంగా జ్యోతుల ఉత్సవం
మడకశిర రూరల్: మండలంలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతుల ఉత్సవానిన వైభవంగా నిర్వహించారు. జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయం నుంచి కంబాల నరసింహస్వామి ఆలయం వరకూ ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళలు భక్తిశ్రద్దలతో జ్యోతులు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉయ్యాలోత్సవం, శయనోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు.
నేడు హుండీ లెక్కింపు:
జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ నరసింహరాజు ఆదివారం వెల్లడించారు. అలాగే మంగళవారం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.
ద్విచక్ర వాహనాల ఢీ – వ్యక్తి మృతి
బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం వెంకటాద్రిపల్లిలో వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాసినేని చంద్రమౌళి(65)కి భార్య శకుంతల, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం బెళుగుప్పలో దుకాణానికి అవసరమైన సరుకులు కొనుగోలు చేసి, రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న తిప్పేస్వామి ఢీకొనడంతో చంద్రమౌలితో పాటు తిప్పేస్వామి, ఆయన భార్య భూలక్ష్మి రోడ్డుపై పడ్డారు. చంద్రమౌళి తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పగాయాలతో తిప్పేస్వామి, భూలక్ష్మి దంపతులు బయటపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న చంద్రమౌళిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తిప్పేస్వామికి కళ్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
వైభవంగా జ్యోతుల ఉత్సవం


