ఇసుక తరలింపు అడ్డగింత
శింగనమల: మండల పరిధిలోని పెన్నా నది, వంకలు, వాగుల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా జిల్లా మైనింగ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. శనివారం రాత్రి ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేపట్టారు. తరిమెల పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా లోడు చేస్తున్న హిటాచీ, ఇసుకతో వెళుతున్న టిప్పరును సీజ్ చేశారు. ఇసుక అక్రమ డంప్‌లోకి తరలిస్తున్న ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న రెరండు ట్రాక్టర్లు, రెండు టిప్పర్లను అదుపులోకి శింగనమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ విజయ్‌కుమార్ మాట్లాడుతూ... ఇసుక, ఎర్రమట్టి తరలింపులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇప్పటికే గార్లదిన్నె మండలంలో 11 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తుండగా మైనింగ్ అధికారులు అడ్డుకుని, వాహనాలను అప్పగించారని వివరించారు.
హంద్రీ–నీవా కాలువలో వ్యక్తి గల్లంతు
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద ఉన్న హంద్రీ నీవా కాలువలో ఆదివారం ఓ వ్యక్తి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. అయితే అతను ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. కాగా, మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతుండే పంపనూరు గ్రామానికి చెందిన మల్లన్న (65) ఆదివారం మధ్యాహ్నం కాలువ వద్ద సంచరించడం చూసినట్లు కొందరు పేర్కొన్నారు. దీంతో గల్లంతైన వ్యక్తి మల్లన్న అయి ఉండవచ్చుననే అనుమానాలు బలపడ్డాయి. సర్పంచ్ ఎర్రిస్వామి, వీఆర్వో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
● అ‘పూర్వ’ సమ్మేళనం
చెన్నేకొత్తపల్లి: దాదాపు 40 ఏళ్ల క్రితం 1984–85లో చెన్నేకొత్తపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో కలసి చదువుకున్న 70 మందిలో 50 మంది అదే పాఠశాల వేదికగా ఆదివారం సందడి చేశారు. ఆప్యాయంగా పలుకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నాటి గురువులను సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆటపాటలతో సరదాగా గడిపారు.
ఇసుక తరలింపు అడ్డగింత


