‘అనంత’లో అఖండ–2 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
వాటిని చించేసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు
రాజు ఫ్లెక్సీలు తొలగించి తన ఫ్లెక్సీలు వేయాలని యాడ్ ఏజెన్సీకి దగ్గుపాటి హుకుం
దీంతో దగ్గుపాటి అనుచరుడు గంగారాంపై రాజు చిందులు
రాజు తరఫున ఫ్లెక్సీలు వేయించిన రాయల్ మురళీపై దగ్గుపాటి బూతులు
బాలకృష్ణకు ఫిర్యాదు చేసిన రాజు, జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్ నానికి ఫిర్యాదు చేసిన మురళి
విషయం ఆరా తీసిన ‘అనంత’ పార్లమెంటు టీడీపీ పరిశీలకుడు సునీల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ టీడీపీలో ‘అఖండ’ చిచ్చు రేగింది. పబ్లిసిటీ కోసం బాలకృష్ణ అభిమానులు చేసిన ఆరాటం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. అనంతపురం, మడకశిర ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన ఈ వివాదం ఒకరిపై ఒకరు బాలకృష్ణకు, పార్టీకి ఫిర్యాదులు చేసేంత వరకూ వెళ్లింది. ఈ తతంగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అఖండ–2 సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ ఫ్లెక్సీలు నగరం మొత్తం భారీగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు జగన్ ‘అనంత’ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు గత నెల 29న సూచించారు.
అయితే తాను శబరిమలకు వెళుతున్నానని చెప్పి ప్రసాద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురంలో ఫ్లెక్సీలు వేశారు. అలాగే శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, హౌసింగ్‌బోర్డులో డివైడర్ల మధ్యలో లాలీపాప్స్ ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకుడు రాయల్ మురళి ఎమ్మెల్యే రాజు తరఫున ఫ్లెక్సీలను పినాకిని యాడ్స్ ఏజెన్సీ ద్వారా వేయించారు.
ఈ క్రమంలో తన నియోజకవర్గంలో మరో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే బాలకృష్ణ దృష్టిలో మైనస్ మార్కులు పడతాయని, ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అంశంలో తీవ్ర నష్టం జరిగిందనే భావనతో రాజు ఫ్లెక్సీలు తొలగించి తనవి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు. వెంటనే దగ్గుపాటి అనుచరుడు గంగారాం పినాకినీ యాడ్స్ యజమాని మురళీకి ఫోన్ చేసి.. రాజు లాలిపాప్స్ తొలగించి దగ్గుపాటివి ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో మురళి టీడీపీ నేత రాయల్ మురళీకి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ అంశాన్ని రాయల్ మురళి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. తన ఫ్లెక్సీలు తొలగిస్తే ఊరుకునేది లేదని రాజు తీవ్రంగా హెచ్చరించారు.
దగ్గుపాటి ప్రసాద్‌పై ఎంఎస్ రాజు నేరుగా బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో ‘అనంత’ పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు సునీల్.. రాజుతో, దగ్గుపాటితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలోనే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్ అయిన గుంటూరు మేయర్ నాని (కోవెలమూడి రవీంద్ర)కి ఫిర్యాదు చేశారు. దీంతో రాయల్ మురళి కూడా నానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఎమ్మెల్యేల వాదులాట అంశం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి ఇద్దరి మధ్య వివాదం ఫ్లెక్సీలది కాదని, ‘అనంత’ మార్కెట్ యార్డు అంశంలో తలెత్తిన విభేదాలు ఇద్దరి మధ్య రాజకీయాలను కాదని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునే స్థాయికి వెళ్లాయని, అది మనసులో పెట్టుకుని ప్రతిసారీ ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారనే చర్చ సాగుతోంది.
ఫ్లెక్సీల చించివేతతో రచ్చ..
అనంతపురం నగరంలోని పవిత్రమార్ట్, సప్తగిరి సర్కిల్ వద్ద రెండు ఫ్లెక్సీలను ‘అనంత’ ఎమ్మెల్యే అనుచరులు శనివారం చించేశారు. ఈ దృశ్యాలను రాయల్ మురళి టీడీపీ నేతలకు వాట్సాప్‌లో పంపి.. గంగారాం చించేయించాడని చెప్పాడు. దీంతో ఎంఎస్ రాజు ఆదివారం నేరుగా గంగారాం ఇంటికి వెళ్లి అతన్ని తన కారులో కూర్చోబెట్టుకుని వాదులాడుకున్నారు.
ఇద్దరి మధ్య గట్టి వాదన జరుగుతున్న సమయంలో దగ్గుపాటి ప్రసాద్.. రాయల్ మురళీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయారు. రాయల్ మురళి కూడా దగ్గుపాటిపై అదే స్థాయిలో రెచ్చిపోయాడు. ‘ఏం చేస్తావ్! నువ్వేం పీకలేవ్!’ అని గట్టిగానే మాట్లాడాడు. ఈ క్రమంలో రాయల్ మురళి ఫోన్‌ను ఎంఎస్ రాజు తీసుకుని దగ్గుపాటితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరూ తీవ్రస్థాయిలో వాదించుకున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.


