బీజేపీ నేత విజయేంద్ర, సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
సువర్ణసౌధ సమాయత్తం
సీఎం కుర్చీ కుస్తీ, అతివృష్టి, రైతుల ఇబ్బందులతో సర్కారుకు ఎదురుగాలి
బెళగావి శివార్లలోని సువర్ణసౌధ అసెంబ్లీ భవనంలో నేటి (సోమవారం) నుంచి రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10 రోజుల పాటు జరిగే సమావేశాలకు భారీ పోలీసు బందోబస్తుతో పాటు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కుర్చీ మార్పిడి గొడవ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లకు ఆయుధం చిక్కినట్లయింది.
శివాజీనగర: బెళగావిలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతాయనడంలో సందేహం లేదు. అతివృష్టి, రైతులకు నష్టాలు, చెరకు రైతుల ఆందోళనలు చర్చకు రాబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి దుమ్మెత్తిపోయాలని ప్రతిపక్షాలు ఆతృతగా ఉన్నాయి.
మొక్కజొన్న, ఉల్లిగడ్డలు, ఎండుమిరప ధరలు తగ్గిపోవడం, అన్నదాతలకు పరిహారంలో లోపాలు, గ్యారంటీ నిధులలో జాప్యం, ఉత్తర కర్ణాటక వెనుకబాటు, అభివృద్ధి కార్యక్రమాలకు సొమ్ములు రాకపోవడం, బెంగళూరుతో సహా రాష్ట్రంలో వరుసగా ఏటీఎంలు, బ్యాంకుల్లో దోపిడీ పర్వాలు సైతం సిద్దరామయ్య ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా మారే అవకాశముంది.
ఢీ అంటే ఢీ
సువర్ణసౌధలో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సమాయత్తమైంది. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చింది. దీంతో ఢీ అంటే ఢీ అనేలా అసెంబ్లీ జరగనుందని అంచనాలున్నాయి. ముఖ్యమంత్రి మార్పిడి రాజకీయం కోలాహలం రేకెత్తించవచ్చు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజయేంద్ర తదితరులు బెళగావికి చేరుకున్నారు. వివిధ హోటళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు బస ఏర్పాటైంది.
హోరెత్తనున్న ఆందోళనలు
ప్రజా, రైతు సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సువర్ణగార్డన్, అలారవాడ వద్ద ధర్నాలకు స్థలం కేటాయించారు. బీజేపీ, జేడీఎస్ నేతలు చెరకు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని 9న సువర్ణసౌధ ముట్టడి నిర్వహిస్తారు. ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఆశాలు, రైతులు, ప్రజలు ఇలా అనేక వర్గాలవారు సౌధ ముందు ఆందోళనలకు సిద్ధమయ్యారు.
ప్రత్యేక రాష్ట్ర వాదనలు
రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తే అవకాశముంది. యాదగిరి, కలబుర్గి, కొప్పళ, బళ్లారి, విజయనగర, బీదర్, రాయచూరు, బాగల్‌కోట, బెళగావి, ధార్వాడ, గదగ్, హావేరి, దావణగెరె జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, కాబట్టి ప్రత్యేక రాష్ట్రం చేయడం అవసరమని హస్తం ఎమ్మెల్యే రాజు కాగె ఇటీవల డిమాండ్ చేశారు.
పాలకులు ఈ ప్రాంతాలపై సవతి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. జనాభా పెరిగేకొద్దీ రాష్ట్రాలను విభజించాల్సిన అవసరముంది. భవిష్యత్తులో కర్ణాటకను రెండు, ఉత్తరప్రదేశ్‌ను 5, మహారాష్ట్రను 3 రాష్ట్రాలుగా విభజించక తప్పదని, బెళగావి అసెంబ్లీపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్యే భరమగౌడ చెప్పారు.
గతంలో లేనంత భద్రత
అసెంబ్లీతో పాటు పరిసరాలలో మునుపెన్నడూ ఏర్పాటు చేయని పోలీస్ భద్రతను ఈసారి చేపట్టారు. బెళగావి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. స్థానిక మరాఠా సంఘాలపై ఓ కన్నేశారు. 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 6 మంది ఐపీఎస్‌లు మకాం వేశారు.


