డీసీఎంతో సిద్ధు వర్గంలోని కీలక నేత సతీశ్ ప్రత్యేక చర్చలు
ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మంతనాలు
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి నాటికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు శుభవార్త అందనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఇంకా ఆయా నేతలతో వరుస సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి మంత్రి సతీశ్ జార్కిహోళితో డీకే శివకుమార్ ప్రత్యేకంగా చర్చించారు. సిద్ధరామయ్య వర్గంలో ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన సతీశ్ జార్కిహోళి ఒక ప్రైవేటు కార్యక్రమంలో డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా డీకే ఇంటికి వెళ్లి మాట్లాడారు. తద్వారా సిద్ధరామయ్య వర్గాన్ని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలను డీకే వేగవంతం చేశారని తెలుస్తోంది. ఈ పరిణామాలు త్వరలో డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖాయమని చెబుతున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ సమావేశాలు, వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు, ఇంకా అనేక అంశాల వల్ల ముఖ్యమంత్రి మార్పు వాయిదా పడిందని, జనవరిలో అన్నింటికీ శుభం కార్డు పడనుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
కాగా సీఎం, డీసీఎం రెండు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌ల ద్వారా ఇరు వర్గాలకు చెందిన నేతల బహిరంగ వ్యాఖ్యలు దాదాపు తగ్గిపోయాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో అందరూ కలసికట్టుగా సాగాలని హైకమాండ్ స్పష్టమైన సందేశం ఇచ్చింది.
కేపీసీపీ అధ్యక్ష పదవి కోసమా?
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాజకీయ వైకుంఠపాళిలో మరో పెద్ద టర్నింగ్ పాయింట్ చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు తప్పనిసరి అయితే కేపీసీసీ అధ్యక్షుడిని కూడా మారుస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేపీసీసీ సారథి రేసులో ఉన్న మంత్రి సతీశ్ జార్కిహోళి డీకేతో చర్చిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.


