పుతిన్‌తో విందుకు రాహుల్, ఖర్గేలను ఆహ్వనించకపోవడంపై కాంగ్రెస్ ధ్వజం
ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వనించడంపై ఆక్షేపణ
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాకను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలకు ప్రభుత్వం ఆహ్వనం పంపకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అదే సమయంలో, తమ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వనించడం, వెళ్తానంటూ ఆయన ప్రకటించడంపైనా స్పందించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, పార్టీ మీడియా ఇన్‌ఛార్జి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విధానాలపై ఏమాత్రం విశ్వాసం లేని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని రకాల ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలను పిలవకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇందులో తాము చెప్పడానికేమీ లేదని, దీనిపై ప్రభుత్వాన్నే అడగాలని వారు మీడియాతో వ్యాఖ్యానించారు. విందుకు పార్టీ ఎంపీ శశి థరూర్‌కు ఆహ్వనం అందడంపై వారు..‘ఈ విషయం థరూర్‌నే అడగండి. తమ పార్టీ నేతలకు ఆహ్వనం ఇవ్వకుండా, తమకు మాత్రమే పిలుపు అందిన సందర్భాల్లో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలి. ఆహ్వనించడంలోనూ రాజకీయాలు నడుస్తుండటం ప్రశ్నార్థకం. అలా అందిన ఆహ్వనాన్ని అంగీకరించడం కూడా ప్రశ్నార్థకమే’అని వారు పేర్కొన్నారు. తనకు అందిన పిలుపుపై శశి థరూర్ స్పందిస్తూ.. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఆ విందుకు తాను వెళ్తున్నానన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలకు పిలుపు అందకపోవడం తనకు తెలియదని చెప్పారు. ఏదేమైనా తనకు ఆహ్వనం అందింది కాబట్టి, విందుకు హాజరవుతానని చెప్పారు.


