రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. 2021 తర్వాత భారత పర్యటనకు పుతిన్ రావడం ఇదే తొలిసారి. అలాగే, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యటనకు పుతిన్ వచ్చిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత చోటుచేసుకుంది. కాగా, పుతిన్ పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య వాణిజ్య, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, పుతిన్ భారత పర్యటనలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణంగా భారత్‌కు రష్యా మిత్ర దేశం కావడమే.
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పుతిన్ హయాంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రష్యా నేతలు భారత్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేశారని గతంలో ఒకసారి పుతిన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా పుతిన్ తొలి భారత పర్యటన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో జరిగింది. ఆ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి బాటలు వేసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.
ఆయుధాలు రష్యావే..
భారత్ రష్యా రక్షణ పరిశ్రమకు పెద్ద మార్కెట్‌గా ఉంది. భారత సాయుధ దళాలు వినియోగించే ఆయుధాల్లో 36 శాతం రష్యావే. రక్షణ సహకారం, లాజిస్టిక్స్ ఒప్పందాల్లో భాగంగా మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు ఐదోతరం సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చలు, ఒప్పందాలు ఎజెండాలో ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ దాడుల నుంచి భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిన S-400కు అప్‌డేటెడ్ వర్షనైన S-500 గగనతల రక్షణ వ్యవస్థ అమ్మకాలపై ఇరుదేశాలు ఓ అవగాహనకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక, మిగ్–29, బ్రహ్మోస్ క్షిపణులు, అణు జలాంతర్గాములు వంటి కీలక వ్యవస్థలు రష్యా సహకారంతోనే నడిచాయి. మరోవైపు.. చైనా సైతం భారత్-రష్యా సంబంధాలు అత్యంత వ్యూహాత్మకమైనవి, ప్రపంచ రాజకీయ ఒత్తిళ్లకు లోబడనిది అని పేర్కొంది.
కీలక ఒప్పందాలు ఇలా..
1. RELOS ఒప్పందం (Reciprocal Exchange of Logistic Support)
- రష్యా పార్లమెంట్ 2025లో ఆమోదించిన కీలక ఒప్పందం.
- రెండు దేశాల సైన్యాలు ఒకరి నౌకాదళ, వైమానిక స్థావరాలు, లాజిస్టిక్ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు.
2. 2021–2031 సైనిక-సాంకేతిక సహకార కార్యక్రమం
- 2021లో 2+2లో సంతకం.
- పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ వంటి విభాగాల్లో దీర్ఘకాలిక సహకారం.
3. సుఖోయ్–30 MKI ఒప్పందం
- 1996లో మొదటి ఒప్పందం.
- 50 విమానాల కొనుగోలు, 140 విమానాల HALలో లైసెన్స్ ఉత్పత్తి.
4. బ్రహ్మోస్ క్షిపణి సంయుక్త ప్రాజెక్ట్
- భారత్-రష్యా సంయుక్త సంస్థ (BrahMos Aerospace).
- ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థ.
5. మిగ్–29 అప్‌గ్రేడ్, కొనుగోలు ఒప్పందాలు
- పలు దశల్లో మిగ్–29 విమానాల కొనుగోలు, అప్‌గ్రేడ్.
6. అణు జలాంతర్గామి (INS Chakra) లీజ్ ఒప్పందాలు
- రష్యా నుండి అణు శక్తితో నడిచే జలాంతర్గాముల లీజ్.
7. S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒప్పందం
- 2018లో సంతకం.
- ఐదు రెజిమెంట్ల కొనుగోలు.
8. కా-226T హెలికాప్టర్ సంయుక్త ఉత్పత్తి ఒప్పందం
- భారత్‌లో తయారీకి ఒప్పందం (Make in India).
9. AK-203 అసాల్ట్ రైఫిల్ ఉత్పత్తి ఒప్పందం
- ఉత్తరప్రదేశ్‌లో సంయుక్త ఉత్పత్తి.
10. పది అంతర్ ప్రభుత్వ ఒప్పందాలు, 15 వాణిజ్య ఒప్పందాలు (2025)
- పుతిన్ పర్యటనలో సంతకం చేయడానికి సిద్ధం చేసిన ప్యాకేజ్.
11. సంయుక్త సైనిక విన్యాసాలు
- ఇండ్రా (INDRA)
- అవియాడ్రిల్
- నౌకాదళ, వైమానిక, భూసేనల సంయుక్త వ్యాయామాలు.
12. అంతరిక్ష–రక్షణ సహకారం
- గగనయాన్ వ్యోమగాముల శిక్షణలో రష్యా పాత్ర.
- అంతరిక్ష–రక్షణ రంగంలో కొత్త ఒప్పందాలు పుతిన్ పర్యటనలో చర్చించబడ్డాయి.
రష్యా-ఉక్రెయిన్ అంశం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఎంతో సంయమనం పాటించింది. రెండు దేశాల శాంతి కోసమే ప్రయత్నాలు చేసింది. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరుపుతూనే.. రష్యా దూరం కాకుండా ముందుకు సాగింది. రష్యా నుంచి చమురు విషయంలోనూ భారత్ ప్లాన్ ప్రకారం నడుచుకుంది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోలా ఉంది. 50 శాతం దిగుమతి సుంకాలతో భారత్‌ను లొంగదీసుకోవచ్చని ఆయన భావించారు. కానీ అది జరగలేదు. అమెరికాకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి చెప్పేయండి అంటూ భారత్‌కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. అయినా రష్యాతో స్నేహ బంధాన్ని భారత్ తెంచుకోలేదు. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ఎక్కువని గతంలో భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. పుతిన్ పర్యటన వేళ కూడా ఇదే దిశగా ఒప్పందాలు, నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రష్యాతో వాణిజ్యం..
2024-25లో భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 68.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 4.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేయగా.. రష్యా నుంచి ఏకంగా 64 బిలియన్ డాలర్ల దిగుమతులను చేసుకుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని ఇరుపక్షాలు ప్రకటించాయి. పుతిన్ పర్యటనలో ఇంధనం ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. భారత్‌కు తక్కువ ధరకే రష్యా ముడి చమురును సరఫరా చేస్తోంది. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉన్న వేళ ఇంధన కొనుగోళ్లపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత అణు పరిశ్రమలో రష్యా సహకారం మరవలేనిది. పుతిన్ పర్యటన వేళ.. పౌర అణు సహకారంలో భాగంగా అణుశక్తిపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. చిన్న రియాక్టర్లను ఉత్పత్తి చేయడంలో అపార అనుభవనం ఉన్న రష్యా.. వాటిని భారత్‌కు ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. కుడంకుళంలో అణుశక్తి ప్రాజెక్టు కొనసాగింపుపై చర్చించనున్నట్లు రష్యా అధికారులు తెలిపారు.
ట్రంప్ రియాక్షన్?
ఒకవేళ రష్యాతో చమురు అనుబంధాన్ని, రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంటే, అమెరికా సీరియస్‌గా స్పందించే ఛాన్స్ ఉంది. ట్రంప్ మరోసారి భారత్‌పై సుంకాలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు కోపాన్ని తెప్పించే నిర్ణయాలు, ఒప్పందాల దిశగా భారత్ ప్రస్తుతానికి అడుగులు వేయకపోవచ్చని వారు అంటున్నారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఆపద కాలంలో ఆదుకునే రష్యాతో చెలిమిని నిలుపుకునే దిశగా లౌక్యంగా భారత్ ముందుకు సాగుతుందని విశ్లేషిస్తున్నారు.
డాలర్‌కు చెక్ పెట్టే ప్లాన్
భారత్, రష్యాలు ప్రస్తుతం అమెరికా డాలరుతో పాటు తమ తమ దేశాల కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలు జరుపుతున్నాయి. రానున్న రోజుల్లో పూర్తిగా సొంత కరెన్సీల్లో వాణిజ్యం జరిపేలా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే అంశంపై పుతిన్, మోదీ చర్చించనున్నారు. అందుకే పుతిన్ వెంట రష్యాకు చెందిన స్పర్ బ్యాంక్ సీఈఓ ఇవాన్ నోసోవ్ కూడా వచ్చారు. వాణిజ్య లావాదేవీల ద్వారా రష్యాకు పెద్దమొత్తంలో భారత రూపాయలు చేరాయి. వాటితో భారత్‌లోని మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని స్పర్ బ్యాంక్ యోచిస్తోంది. భారత్‌తో వాణిజ్య లావాదేవీలు జరిపే క్రమంలో రష్యా వ్యాపారులకు రూపాయి విలువ కలిగిన లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ఈ బ్యాంకు ప్రారంభించింది. ఒకవేళ దీనిపై భారత్-రష్యాలు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రష్యా, భారత్‌పై ట్రంప్ మరోసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.


