సాక్షి, న్యూఢిల్లీ: గగనతల ప్రయాణాలపై గందరగోళం కొనసాగుతున్న వేళ.. ఇండిగోకు భారీ ఊరట దక్కింది. పైలట్లకు వారాంతపు విశ్రాంతి ఇచ్చే ఏవియేషన్ న్యూ రూల్స్‌ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడి ప్రయాణాలు సాఫీగా సాగే అవకాశం కనిపిస్తోంది.
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(FDTL) పేరిట.. పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పని సరిచేసింది డీజీసీఏ. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటికే పైలట్ల కొరతలో ఉన్న ఇండిగోకు ఇది మరింత చిక్కుల్ని తెచ్చి పెట్టింది. పైలట్ల కొరత కారణంగా గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడం.. మరికొన్నింటిని దారి మళ్లించడం చేసింది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో..
డీజీసీఏ ఇండిగో నుంచి వివరణ కోరింది. అయితే పరిస్థితుల ప్రభావం, ఇండిగో నుంచి వివరణ.. రూల్స్ విషయంలో మినహాయింపు కోరుతూ చేసిన విజ్ఞప్తిని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.

నాలుగు రోజుల్లో..
నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎఫ్‌డీటీఎల్ కొత్త నిబంధనల్లో.. పైలట్లు రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని డీజీసీఏ ఆదేశించింది. రోజులో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. రాత్రి పూట ఫ్లైయింగ్, ల్యాండింగ్ విషయంలోనూ కఠిన నిబంధనలు తెచ్చింది. వీటితో పాటు ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. కానీ, రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో ఎయిర్‌లైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రూల్స్‌ను తక్షణమే ఉపసంహరించుకుంది.

డీజీసీఏ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం విమాన పైలెట్లకు వారంలో కనీసం 48 గంటల విశ్రాంతినివ్వాలి. దీన్ని సెలవులకు ప్రత్యామ్నాయంగా వాడటం కుదరదు. అయితే ఇండిగో విమానాల మూకుమ్మడి కేన్సిలేషన్ నేపథ్యంలో డీజీసీఏ ఈ నిబంధనను సడలించింది. కాకపోతే నెల రోజుల్లో ఒక పైలెట్ గరిష్టంగా విమానం నడపగల గంటలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. విమాన సిబ్బందిపై పని ఒత్తిడిని అంచనా వేసేందుకు విమానయాన సంస్థలు తగిన పద్ధతులను అభివృద్ధి చేయాలని కూడా డీజీసీఏ తన కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది.
వరుస నైట్‌డ్యూటీలను తప్పించేలా రోస్టర్లను తయారు చేయాలని సూచించింది. పైలెట్ల విషయానికి వస్తే వీరి ఒత్తిడిని గుర్తించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే బుధవారం నుంచి దేశవ్యాప్తంగా పలు ఇండియో విమానాలు రద్దయ్యాయి. లేదంటే వాయిదా పడ్డాయి. చౌక విమానయాన సంస్థ కావడంతో సిబ్బందిని అతి తక్కువగా ఉంచుకుందీ సంస్థ. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్గుఆ తాము కొత్త నిబంధనలను రూపొందించినట్లు డీజీసీఏ చెబుతూండగా.. అకస్మాత్తుగా వీటిని అమలు చేయాల్సి రావడం సమస్యలకు దారితీసిందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.


