ఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మోదీ-పుతిన్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ఇరుదేశాల సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగింది.
పుతిన్‌కు ప్రధాని మోదీ శాంతి సందేశం ఇచ్చారు. ఇది శాంతియుగం.. భారత్ శాంతిపక్షమేనన్నారు. భారత్-రష్యా మధ్య 25 ఒప్పందాలు జరగనున్నాయని మోదీ అన్నారు. భారత్‌కు రష్యా నిజమైన స్నేహితుడన్న ప్రధాని మోదీ.. పుతిన్ విజన్‌ను అభినందించారు.
వరుస భేటీతో పుతిన్ షెడ్యూల్ ఇవాళ (శుక్రవారం) బిజీబిజీగా సాగుతోంది. పుతిన్‌కు ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలికాయి. పుతిన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో సదస్సులో పాల్గొన్నారు. ఇదే భవనంలో పుతిన్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఏర్పాటు చేశారు.
సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్‌ను పుతిన్ ప్రారంభిస్తారు. భారత్ మండపంలో ఫిక్కి, రాస్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్ పాల్గొంటారు. అనంతరం పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు.


