సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా పరవుమాసినా మోదీ ప్రభుత్వంలో ఇంచు కూడా చలనం లేదంటూ విపక్ష పార్టీలు పార్లమెంట్ వేదికగా ఆందోళనకు దిగారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని, నల్ల మాస్క్‌లు ధరించిన విపక్ష పార్టీల సభ్యులు మకరద్వారం వద్ద నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ చేసిన ‘‘ శీతాకాల సుందర ప్రకృతిని ఆస్వాదించండి’ వాక్యాలను పెద్ద బ్యానర్‌పై రాసి ఎంపీలంతా ప్రదర్శించారు. ‘‘ఓవైపు పిల్లలు కాలుష్య వాయువు కారణంగా చనిపోతుంటే ఇకనైనా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాలి.
నాలాంటి వృద్ధులు సైతం ఎంతో బాధపడుతున్నారు’’ అని సోని యాగాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీవాసులంతా ఎందుకింతగా కష్టపడాలి? అని మోదీని ప్రశ్నిస్తే ఆయనేమో శీతాకాలం ఎంత బాగుందోకదా అని మాట్లాడుతున్నారు. వాయుకాలుష్యంపై బీజేపీ నిర్లక్ష్య వైఖరిపై పార్లమెంట్ వేదికగా నిలదీస్తాం’’ అని ఖర్గే అన్నారు. ‘‘ రాజకీయంగానీ ఈ వాయుకాలుష్యం సమస్యపై తక్షణం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలి. ఈ అంశం పార్లమెంట్‌లో చర్చకు రావాలి. చర్యల విషయంలో మేం ప్రభుత్వానికి మద్దతిస్తాం’’ అని ప్రియాంకాగాంధీ అన్నారు.


