సోనియా నివాసంలో కాంగ్రెస్ అధిష్టానం భేటీ
త్వరలో మరో సమావేశం
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అధికార మార్పిడిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో శనివారం రాత్రి అధిష్టానం నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కర్ణాటక అంశాన్ని ప్రత్యేకంగా చర్చించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
అయితే సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, రానున్న రోజుల్లో మరోసారి సమావేశమై చర్చిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలసికట్టుగానే ఉన్నారని కూడా తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య రెండు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌ల అనంతరం రాష్ట్రంలో సీఎం మార్పు అంశం తాత్కాలికంగా బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.
సంక్రాంతికి డీకేకు శుభవార్త!
‘ఐదేళ్లు నేనే సీఎం’ అని చెప్పుకునే స్థాయి నుంచి ‘రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు’ అని చెప్పుకునే స్థాయి వరకూ సిద్ధరామయ్య దిగిరావడాన్ని చూస్తే, డీకే సీఎం అవ్వడం దాదాపు ఖాయం అయినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సంక్రాంతికి డీకేకు హైకమాండ్ శుభవార్త అందించనున్నట్లు కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డీకేను ముఖ్యమంత్రిని చేస్తే వచ్చే సాధకబాధకాలపై హైకమాండ్ ప్రధానంగా శనివారం చర్చించినట్లు కూడా తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని వెల్లడించకముందు మరోసారి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని హైకమాండ్ భావిస్తోంది. ఇరువురి మధ్యా మరో బ్రేక్‌ఫాస్ట్ సమావేశం జరిగే అవకాశం ఉందని అంచనా. అనంతరం ఇద్దరిని ఢిల్లీకి పిలిపించి హైకమాండ్ చర్చించనున్నట్లు భావిస్తున్నారు.


