రూ.130 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
బనశంకరి: కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని బీడీఏ స్వాధీనం చేసుకుంది. బెంగళూరు దక్షిణతాలూకా, ఉత్తరహళ్లి హోబళి జేపీ.నగర 9వ ఫేజ్ లేఔట్ ఆలహళ్లి గ్రామం సర్వేనంబర్ 20లోని మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలను చేపట్టారు. దీంతో బెంగళూరు అభివృద్ధి ప్రాధికార(బీడీఏ) అధికారులు శుక్రవారం పోలీస్ భద్రత మధ్య జేసీబీ యంత్రాలతో వెళ్లి ఆక్రమణలు తొలగించి రూ.130 కోట్ల విలువచేసే భూమిని స్వాధీనం చేసుకున్నారు.
బోనులో చిక్కిన చిరుత
మైసూరు: మైసూరు జిల్లా సరగూరు తాలూకా ఎన్. బెల్తూర్ ఓల్డ్ గేట్ సమీపంలో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో పడింది. కొన్ని నెలలుగా చిరుతపులి ఎన్. బెల్తూర్ ఓల్డ్ గేట్ సమీపంలోని పొలాల్లో సంచరిస్తూ 37 ఆవులను హతమార్చింది. దీంతో అటవీశాఖ అధికారులు 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన యోగేష్ అనే రైతు పొలం సమీపంలో బోను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించి మగచిరుతగా గుర్తించారు. మత్తుమందు ఇచ్చి బంధించి రేడియో కాలర్ అమర్చి అడవిలోకి వదిలేశారు. ఏసీఎఫ్ మధు, ఆర్‌ఎఫ్‌ఓ సిద్ధరాజు, చిరుత టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
బంగ్లాదేశీయుల
టెంట్లలో మంటలు
యశవంతపుర: బంగ్లాదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్న షెడ్లలో మంటలు వ్యాపించిన ఘటన బెంగళూరు పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. కూడ్లు చెరువుకు సమీపంలో బంగ్లాదేశీయులు షెడ్లు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో షెడ్లలో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న బంగ్లాదేశీయులు మేల్కొని బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమీపంలోని విద్యుత్ తీగ తెగి పడటంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పరప్పన అగ్రహరం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
మ్యూల్ అకౌంట్లతో
వంచన: 13 మంది అరెస్ట్
బనశంకరి: రాష్ట్రంలో సైబర్ నేరాలు పెచ్చుమీరడాన్ని తీవ్రంగా పరిగణించిన సీఐడీ అధికారులు మ్యూల్ అకౌంట్ల ద్వారా భారీ ప్రమాణంలో సైబర్‌వంచన దందాకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. ఒకేసారి పలు చోట్ల దాడులు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందాలు అక్రమంగా వాడుతున్న 40 వేలకు పైగా మ్యూల్ అకౌంట్ల ఆచూకీని కనిపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్లకుపైగా ఒకేసారి దాడులు నిర్వహించిన సీఐడీ బృందం దందాలో నిమగ్నమైన 13 మందిని అరెస్ట్ చేశారు. అమాయక ప్రజలు బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం కార్డులు, అకౌంట్ వివరాలను డబ్బుల కోసం సేకరించి సైబర్ వంచకులకు అందిస్తున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెలుగు చూసింది. మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆన్‌లైన్ వంచనకు పాల్పడి నగదు బదిలీ, ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేశారు. అకౌంట్ వివరాలు ఇచ్చిన అమాయకులకు ఈ వంచన గురించి ఎలాంటి సమాచారం తెలియదు. దర్యాప్తు సమయంలో సుమారు 40 వేలకు పైగా మ్యూల్ అకౌంట్లు వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలి రోజుల్లో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో మ్యూల్ అకౌంట్లపై సీఐడీ బృందం తీవ్ర నిఘా పెట్టి దర్యాప్తు తీవ్రతరం చేశారు.
రూ.130 కోట్ల విలువైన స్థలం స్వాధీనం
రూ.130 కోట్ల విలువైన స్థలం స్వాధీనం


