సినీ ఫక్కీలో హైటెక్ దోపిడీ
హుబ్లీ: హావేరి సమీపంలోని జాతీయ రహదారి–48లో గూడ్స్ లారీలో తరలిస్తున్న రూ.లక్షలు విలువ చేసే వస్తువులను సినీ ఫక్కీలో దోపిడీ చేసిన ఘటన వెలుగు చూసింది. బెంగళూరు నుంచి ధార్వాడ జిల్లా కోలూరా గ్రామంలోని ఫ్లిప్‌కార్ట్ వేర్‌హౌస్‌కు లారీ వెళ్తుండగా ఈ దోపిడీ జరిగింది. సుమారు 6 పెద్ద బాక్సుల్లోని రూ.25 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్నారు. హవేరి జిల్లా రాణిబెన్నురు తాలూకా కాకోళ గ్రామం నుంచి మోటెబెన్నురు చేరుకునే లోపే దొంగతనం పూర్తి చేశారు. సుమారు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘరానా దోపిడీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి రాణెబెన్నురు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రహదారి–48 పొడవునా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గూడ్స్ లారీలో
రూ.25 లక్షల విలువైన వస్తువులు చోరీ


