ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నల వర్షం
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు జవాబులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన
ధరలపై క్యాప్ విధించినా ఎందుకు అమలు కావడం లేదని నిలదీత
ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు నవంబర్ 1 నుంచి రెండో దశ అమల్లోకి వస్తే.. డిసెంబర్‌లో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడిందని నిలదీసిన ఎంపీలు
మంత్రి జవాబులపై ఆగ్రహిస్తూ వాకౌట్
జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాల చానళ్లలో టీవీ డిబేట్లు
మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడును ఎంపీలు నిలదీశారు. సంక్షోభం జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టికెట్ల ధరలు రూ.50 వేలు, రూ.60 వేలు, రూ.75 వేలు, రూ.1 లక్ష ఏమిటని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పిన సమాధానాలపై ఆ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ఏదేదో చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు.
మరోపక్క జాతీయ మీడియాతో పాటు, అన్ని రాష్ట్రాల మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో జరిగే డిబేట్స్‌లో పాల్గొంటున్న వక్తలు, నెటిజన్లు కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో పౌరవిమానయానశాఖపై పలువురు ఎంపీలు ప్రశ్నలు సంధించారు. వీరిలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే వారున్నారు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎస్‌ఎస్), ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు, ఇండిగో సంక్షోభం, టికెట్ల ధరలు, క్యాన్సిలేషన్ రీఫండ్ తదితర సమస్యలపై ఎంపీలు ప్రశ్నలు వేశారు. వీటికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మౌఖిక సమాధానమిచ్చారు. ‘ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను రూపొందించేముందు మేం అందరితో చర్చించాం. నవంబర్ 1 నుంచి రెండోదశ నిబంధనలు అమల్లోకి తెచ్చాం.
అవి అమల్లోకి వచ్చాక నెలవరకు సర్విసులు సజావుగా సాగాయి. డిసెంబర్ 3 నుంచే ఈ సమస్య తలెత్తింది. ఇండిగో అంతర్గత సమస్యల వలనే ఈ సంక్షోభం ఏర్పడింది’ అని చెప్పారు. ఈ సమాధానాలపై ఎంపీలు రాంజీలాల్ సుమన్, ప్రమోద్ తివారీ, డాక్టర్ తంబిదొరై తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. . సంక్షోభం రాబోతోందని తెలిసి కూడా ముందే ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. పైలెట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే విమాన సర్వీసులు రద్దయ్యాయని, తాము ప్రయాణికులకు భరోసా కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. మీరు ధరలను నియంత్రిస్తే నేను రూ.75 వేలు ఖర్చుచేసి టికెట్ ఎందుకు కొంటానంటూ అన్నాడీఎంకే ఎంపీ డాక్టర్ తంబిదొరై మంత్రిని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు 5,86,705 టికెట్లు క్యాన్సిల్ అయ్యాయని, వీటికి దాదాపు రూ.569 కోట్లు రీఫండ్ చేశారని మంత్రి సమాధానమిచ్చారు. తాము ఒకటి అడిగితే మంత్రి మరొకటి చెబుతున్నారంటూ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా విమాన సంక్షోభం ఏర్పడితే దాన్ని అరికట్టడంలో కేంద్రమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారు. ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు రెండోదశవి నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తే డిసెంబర్ నెల మొదటి వారంలో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడింది? వీటిపై మీకు ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదా? మేం అడిగే వాటికి మీరెందుకు సూటిగా సమాధానం చెప్పటంలేదు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీలు సభనుంచి వాకౌట్ చేశారు.
రామ్మోహన్‌నాయుడిపై ఆగ్రహజ్వాలలు
కేంద్రమంత్రిపై ప్రజల్లో ఇంకా ఆగ్రహజ్వాలలు తగ్గలేదు. జాతీయ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన మీడియాలోను డిబేట్లు పెట్టి కేంద్రమంత్రి రామ్మోహన్ తీరును ఎండగడుతున్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు అష్టకష్టాలు పడుతుంటే మంత్రికి కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇండిగో సంక్షోభం రాబోతుందని ముందే తెలిసినా మంత్రి మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫ్‌లైట్‌క్యాన్సిల్ అయినప్పుడు క్షణాల వ్యవధిలో రీఫండ్ వచ్చేలా ఎందుకు చేయలేకపోయారంటూ మండిపడుతున్నారు.
దేశంలోని అన్ని విమానాశ్రయాలు.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లను తలపిస్తున్నాయని పేర్కొంటున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులకు మంత్రి ఎందుకు భరోసా కల్పించలేదని నిలదీస్తున్నారు. కేంద్రమంత్రి తన పదవికి గౌరవంగా రాజీనామా చేయాలంటూ మీడియా డిబేట్లలో కూర్చున్న విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ డిమాండ్ రోజురోజుకు పెరగడం గమనార్హం. కేంద్రమంత్రి తీరును ఎండగడుతూ ఎక్స్ వేదికగా నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


