‘ఇండిగో’ సంక్షోభంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న డిమాండ్లు
ఇంత అసమర్థ మంత్రి, టికెట్ల ధరల మోత, సంక్షోభాన్ని అరికట్టలేని మంత్రి మాకొద్దు.. అంటూ నిరసనల వెల్లువ
ఆలిండియా పైలెట్ల అసోసియేషన్ రెండు నెలలు ముందే అప్రమత్తం చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన పౌరవిమానయాన శాఖ మంత్రి
సమస్యకు మూల కారణం పరిష్కరించకుండా ఎల్లో మీడియాలో ఇంటర్వ్యూలు
రామ్మోహన్ నాయుడు అసమర్థతే సమస్య జఠిలం కావటానికి కారణమని నిశ్చితాభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం
ఇండిగో సంస్థతో నేరుగా ప్రధాని కార్యాలయం చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇండిగో’ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా దేశం పరువు మసకబారడం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం.. లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురి కావడం.. ఎయిర్‌పోర్టుల్లో కన్నీళ్లు పెట్టడం.. ఐదారు రోజులు గడిచిపోయినా కష్టాలు తీరకపోవడం.. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు అసమర్థ పనితీరుతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో ఇక ప్రధాని కార్యాలయం నేరుగా రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రెండు నెలల ముందే ఈ సమస్య తన దృష్టికి వచ్చినా పట్టించుకోకపోవడంతోనే సమస్య జటిలమైందని కేంద్ర ప్రభుత్వం ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రధాని కార్యాలయమే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రధాని పర్యవేక్షణలో పీఎంలో ఉన్నతాధికారులు నేరుగా ఇండిగో సీఈవో, ఇతర అధికారులతో చర్చలు జరిపారు. సంక్షోభం ముంచుకొస్తోందని పసిగట్టిన ఆల్ ఇండియా పైలెట్ల అసోసియేషన్ రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ దృష్టికి తెచ్చింది.
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు కనీసం స్పందించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. సమస్యకు మూల కారణం తెలిసినా దాన్ని పరిష్కరించకుండా ప్రయాణికులకు రీఫండ్ ఇప్పిస్తామంటూ ఎల్లో మీడియాలో ప్రచారానికి తెర తీశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కేవలం ఎల్లో మీడియాను మాత్రమే పిలిపించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎన్డీఏలోని కీలక నేతలు సైతం ఆయన కేంద్ర మంత్రా? లేక టీడీపీ మంత్రా? అని విస్తుపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇంత అసమర్థ మంత్రి, చేతకాని మంత్రి, ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేని మంత్రి, టికెట్ల ధరల మోత, సంక్షోభాన్ని అరికట్టలేని మంత్రి మాకొద్దు..! అంటూ జాతీయ స్థాయిలో మీడియాలో, సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని, అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం నుంచి తాజాగా ఇండిగో సంక్షోభం దాకా దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు.
రామ్మోహన్‌నాయుడు తక్షణం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశనీయమైంది. ఫోన్ కాల్స్‌కి కేంద్ర మంత్రి స్పందించడం లేదని.. ప్రజల సమస్యను గాలికొదిలేసి స్నేహితులతో కలిసి పార్టీలు, నెట్‌ఫ్లిక్ చూసుకోవడం, రీల్స్ చేసుకోవడంలో మంత్రి బిజీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండిగో సంక్షోభం తలెత్తిన మూడోరోజు న్యూఢిల్లీలో స్నేహితుడి పార్టీలో పాల్గొన్న రామ్మోహన్‌నాయుడి ఫోటోలను షేర్ చేస్తూ మండిపడుతున్నారు. గతంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రమాద సమయంలో కూడా సంఘటనాస్థలికి వెళ్లి వాటిని రీల్స్‌గా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న సంఘటలను గుర్తు చేస్తున్నారు.
దేశం దిగ్భ్రాంతిలో ఉంటే వీడియోలా!
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రం చెక్ పెట్టనుందా? అనే చర్చ దేశ రాజధానిలో జోరుగా సాగుతోంది. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం మొదలు ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన రామ్మోహన్ నాయుడుపై ప్రధాని కార్యాలయం సహా కేంద్ర పెద్దలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 230 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజుగా నిలిచింది. సంఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్, షర్ట్‌ను మోచేతి వరకు మడతపెట్టడం చూసిన నెటిజన్లు మండిపడ్డారు. దేశం అంతా దిగ్భ్రాంతిలో ఉంటే వీడియోలు చేసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.


