షిర్డీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, ఇంధన సంక్షోభం తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక సౌర శక్తి వినియోగంతో వేల సంఖ్యలో భక్తుల ఆకలిని తీరుస్తూ, పర్యావరణ హితంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు ఏకంగా 40 వేల మంది భక్తులకు సూర్యరశ్మి సాయంతో వండిన వేడివేడి ప్రసాదాన్ని అందిస్తోంది షిర్డీ ట్రస్ట్.
ఏమిటీ సోలార్ మహత్మ్యం?
షిర్డీ ప్రసాదాలయంలో సుమారు 1.37 కోట్ల రూపాయల వ్యయంతో 2009లోనే ఈ సోలార్ కుకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం 73 సోలార్ డిష్‌ల సాయంతో సూర్యరశ్మిని కేంద్రీకరించి, 150 లీటర్ల సామర్థ్యం ఉన్న 10 భారీ కుక్కర్లతో ఇక్కడ వంట చేస్తారు. ఏక కాలంలో 15 క్వింటాళ్ల బియ్యం, 5 క్వింటాళ్ల పప్పు, 5 క్వింటాళ్ల కూరగాయలను ఉడికిస్తారు. సాధారణంగా ఇంతటి స్థాయిలో వంట చేయాలంటే రోజుకు 1,700 కిలోల గ్యాస్ అవసరమయ్యేది. కానీ ఈ సోలార్ సిస్టమ్ వల్ల రోజుకు భారీగా గ్యాస్ ఆదా అవుతోంది.
కోట్లలో ఆదా.. పర్యావరణానికి మేలు
2009 నుంచి 2026 మధ్య కాలంలో ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 2 లక్షల కిలోలకు పైగా గ్యాస్‌ను ట్రస్ట్ ఆదా చేసింది. దీనివల్ల దాదాపు 2 కోట్ల రూపాయల ఆర్థిక భారం తగ్గింది. కేవలం వంటకే కాకుండా, భక్తుల సౌకర్యార్థం సాయి ఆశ్రమం తదితర వసతి గృహాల్లో 10 వేల మందికి పైగా భక్తులకు ఉచితంగా వేడి నీటిని అందించేందుకు కూడా సౌర శక్తిని వాడుతున్నారు.
దేశానికే ఆదర్శం
రోజుకు సగటున 80 వేల మంది భక్తులు సాయి దర్శనానికి వస్తుండగా, అందులో సగం మంది ప్రసాదాలయంలో భోజనం చేస్తున్నారు. ఇంధన ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో షిర్డీ ట్రస్ట్ అవలంబిస్తున్న ఈ విధానాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఒక ‘యూనిక్ మోడల్’గా గుర్తించి గౌరవించింది. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికత తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో షిర్డీ సాయి సంస్థాన్ నిరూపిస్తోంది.
ఇది కూడా చదవండి: ‘దళపతి’ మైండ్ గేమ్.. దిక్కుతోచని బీజేపీ?


