సాధారణంగా టూవీలర్ నడిపేవాళ్లే హెల్మెట్ ధరిస్తారు. కానీ ఇక్కడ కారు నడిపే వ్యక్తి హెల్మెట్ వేసుకుని కారు డ్రైవ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్షన్ అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించి కనిపించారు. గతంలో హెల్మెట్ ధరించనందుకు పోలీసులు అతనికి జరిమానా విధించారని, అందుకే ఇప్పుడు హెల్మెట్ ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.
2025 నవంబర్ 26న తన ఫోర్ వీలర్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించనందుకు పోలీసులు రూ.1,100 జరిమానా విధించారని గుల్షన్ అన్నారు. ''నేను సీట్ బెల్ట్ ధరించాను, కానీ హెల్మెట్ ధరించనందుకు పోలీసులు నాకు జరిమానా విధించారు" అని అతను చెప్పారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అందుకే జరిమానా విధించినప్పటి నుంచి కారు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరిస్తున్నానని, భవిష్యత్తులో చలాన్‌లను పొందకుండా ఉండాలంటే వేరే మార్గం లేదని అన్నారు.
ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్లకు జరిమానాలు విధించిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరోమారు యూపీలో అలాంటి ఘటన తెరపైకి వచ్చింది.


