
మదనపల్లె: అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్ పోలీసులు శనివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అయిన ములకలచెరువు నల్లగుట్టకు చెందిన సయ్యద్ కలీం అష్రఫ్ (23)ను అరెస్ట్ చేసి తంబళ్లపల్లె తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరచగా, ఏడు రోజులు రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు.
తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డికి చెందిన స్కారి్పయో వాహనంలో సయ్యద్ కలీం అష్రఫ్ నకిలీ మద్యాన్ని బెల్టుషాపులకు సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో 23 మందిని నిందితులుగా పేర్కొనగా, ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. కాగా, అరెస్ట్ చేసిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది.
నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్దన్‌కు రిమాండ్
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడి
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌కు ఈనెల 17వరకు విజయవాడలోని 6వ ఏజేఎం ఫస్ట్ క్లాస్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అద్దేపల్లిని శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ నుంచి కోర్టుకు, ఆ తర్వాత న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరు పరిచారు. కోర్డు రిమాండ్ విధించడంతో అద్దేపల్లి జనార్దన్‌ను నెల్లూరు జైలుకు తరలించారు.
రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
జనార్దన్ రిమాండ్ రిపోర్టులో తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనతోపాటు కట్టా సురేంద్ర నాయుడుతో తనకు లిక్కర్ వ్యాపారంలో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరూ అధిక సంఖ్యలో వైన్‌షాపులు దక్కించుకున్నారని పేర్కొంటూ, రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వ్యాపార అనుభవం లేని కారణంగా నష్టాలు రావడంతో తనను సంప్రదించారని తెలిపాడు. వీరికి చెందిన ములకలచెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయునిపల్లిలోని ఆంధ్రవైన్స్ తానే నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 2025 మే, జూన్ నెలల నుంచి ములకలచెరువులో అద్దేపల్లి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అదే సమయంలో ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్నార్ బార్‌తోపాటు శ్రీనివాస వైన్స్‌లో విక్రయించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, హీల్స్ బాలాజీ సరఫరా చేసేవాడని, అలాగే లేబుల్స్, బ్రాండ్ స్టిక్కర్స్ రవి సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లో ఈ–7 అనే బార్‌లో పార్టనర్‌గా చేరి అక్కడ చీప్ లిక్కర్‌ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్‌తో గోవా వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్‌లో ఉన్న బాలాజీతో చేతులు కలిపి అతని ద్వారా నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, హీల్స్, క్యాప్‌లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చి, తయారీ తర్వాత బార్‌లో విక్రయించాడు.
నకిలీ మద్యం తయారీకి ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఐషర్ వాహనాల్లో ఇబ్రహీంపట్నంకు స్పిరిట్‌ను తరలించేవారు. అలా వచ్చిన మెటీరియల్‌ను ఉపయోగించి తన సోదరుడు జగన్‌మోహన్‌రావుతో కలిసి జనార్దన్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. జయచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో లిక్కర్ వ్యాపారం ఉన్న ట్లు గుర్తించారు. ఈ కేసు నుంచి ఆయనను తప్పించేందుకు ముఖ్యనేత యత్నించడం గమనార్హం.