ఇటీవల చైనా షాంగై ఎయిర్ పోర్టులో ఇండియాకు చెందిన ఓ మహిళను చైనా అధికారులు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆ విషయంపై చైనాను వివరణ కోరింది. భారతీయులు చైనా దేశం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపింది. ఈ మేరకు డ్రాగన్ దేశం నమ్మకం కలిగేలా హామీ ఇవ్వాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తరచుగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. ఆ ప్రాంతం చైనాదేనని చెప్పడం అంతేకాకుండా ఆదేశ మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ భాగంగా చూపడంతో తరచుగా ఈ అంశంలో ఇరు దేశాలకు ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఓ మహిళ యూకే నుండి జపాన్ ప్రయాణిస్తుండగా మార్గం మద్యలో షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఆసమయంలో అక్కడి ప్రభుత్వాలు ఆమె అరుణాచల్ ప్రదేశ కు మహిళ అని తెలిసి తనను వేధించారని తెలిపింది. అంతే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అన్నారని పేర్కొంది. ఈ ఘటనను భారత్ ఆసమయంలోనే ఖండించింది.
తాజాగా భారత్ చైనాను ఒక వివరణ కోరింది. భారత విదేశాంగ కార్యదర్శ రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ " భారతీయులు చైనా మీదుగా వెళ్లేటప్పుడు వారినే టార్గెట్ గా చేసుకొని ఇబ్బందులు పెట్టమని చైనా తెలపాలి. ఆ మేరకు నమ్మకం కలిగేలా అధికారులు ప్రకటన చేయాలి. ఇష్టానుసారంగా వ్యవహరించకుండా అంతర్జాతీయ ప్రయాణ చట్టాలను గౌరవించాలి. చైనా మీదుగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు భారతీయులు జాగ్రత్తగా ఉండాలి" అని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఇది వరకే చాలా సార్లు భారత్ చెప్పింది. దాని గురించి మరోసారి మాట్లాడదలుచుకోలేదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. అయితే ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సహృద్భావ వాతరణంలో ఇరు దేశాల మైత్రి సాగుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.


