న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో అక్రమ వలసదారుగా అనుమానిస్తూ, బంగ్లాదేశ్‌కు తరలించిన గర్భిణి సునాలి ఖాతున్ (25), ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు. గత ఐదు నెలలుగా ఆమె జరిపిన న్యాయ పోరాటం దరిమిలా, సుప్రీంకోర్టు ఈ ఉదంతంలో జోక్యం చేసుకుంది. మానవతా కారణాలతో ఆమె భారత్‌లో ప్రవేశించేందుకు అనుమతించింది. ఈ నేపధ్యంలో ఆ తల్లీకొడుకులు పశ్చిమ బెంగాల్‌లోని మెహదీపూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ మీదుగా భారత భూభాగంలోకి అడుగుపెట్టారు.
పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో ఉంటున్న సునాలి, ఆమె భర్త డానిష్ షేక్‌లను జూన్ 26న ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేసి, సరిహద్దు మీదుగా బంగ్లాదేశ్‌కు తరలించారు. అయితే సునాలి ఆమె కుమారుడిని తిరిగి భారత్ తీసుకురావడంలో సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు విజయం సాధించారు. ఇందుకోసం కృషి చేసిన బిర్భూమ్‌కు చెందిన సామాజిక కార్యకర్త మోఫిజుల్ ఇస్లాం మాట్లాడుతూ.. సునాలి, ఆమె కుమారుడిని తిరిగి తీసుకురావడంలో తాము విజయం సాధించినప్పటికీ, సునాలి భర్త డానిష్, మరో మహిళ స్వీటీ బీబీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పటికీ బంగ్లాదేశ్‌లోనే ఉన్నారని తెలిపారు.
వారి భారత పౌరసత్వాన్ని కేంద్రం సవాలు చేస్తున్నందున, దానిని పరిష్కరించి, వారిని తిరిగి తీసుకువచ్చే వరకు విశ్రమించబోమని ఇస్లాం పేర్కొన్నారు. ఈ కుటుంబాలు బంగ్లాదేశ్‌లో పాస్‌పోర్ట్, విదేశీయుల చట్టం కింద అరెస్టు అయ్యారు. అయితే వారికి డిసెంబర్ ఒకటిన బెయిల్ లభించింది. గతంలో సునాలి భారతదేశంలోనే తన బిడ్డకు జన్మనివ్వాలని భావించింది. కలకత్తా హైకోర్టు సెప్టెంబర్ 26న రెండు కుటుంబాలలోని ఆరుగురు సభ్యులను నాలుగు వారాల్లోగా తిరిగి తీసుకురావాలని ఆదేశించింది. అక్టోబర్ 3న చపైనావాబ్‌గంజ్ జిల్లా కోర్టు కూడా ఆధార్ కార్డుల ఆధారంగా వారిని భారతీయ పౌరులుగా ప్రకటించి, తిరిగి పంపాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోలేకపోయిందని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సమీరుల్ ఇస్లాం తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. న్యాయవాదులు ఈ విషయాన్ని మరోసారి సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించిన తర్వాతే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. కాగా బాధితురాలు సునాలి, ఆమె కుమారుడు భారత్ వచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్ పోలీసులు వారిని మాల్డా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంఓహెచ్)సుదీప్తో భాదురి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు వారిద్దరినీ కనీసం 24 గంటలు వైద్య పర్యవేక్షణలో ఉంచుతామన్నారు. సునాలికి రక్త లోపం ఉందని, వైద్యుల బృందం ఆమె పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన వైద్య సాయం అందిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: టపాసులే కాదు.. కొత్త క్యాలెండర్లు కూడా..


