కోల్‌కతా: టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ తలపెట్టిన బాబ్రీ తరహా మసీదు విషయంలో తాము కలుగజేసుకోబోమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగాలో బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ వంటి మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు హుమాయూన్ కబీర్ ఇటీవల ప్రకటించడం తెల్సిందే.
అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదమున్నందున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా తగినన్ని పోలీసు బలగాలను అక్కడుంచామని రాష్ట్ర ప్రభుత్వం, 19 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను అక్కడ మోహరించినట్లు కేంద్రం తెలిపాయి. అవసరమైతే అదనంగా బలగాలను తరలిస్తామని కూడా పేర్కొన్నాయి. దీంతో, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పౌల్ సారథ్యంలోని డివిజన్ బెంచ్ పై విషయం స్పష్టం చేసింది.


