న్యూఢిల్లీ: ఆలయానికి చెందిన సొమ్మును ఆ దేవత కోసం వాడాలే తప్ప, కష్టాల్లో ఉన్న సహకార బ్యాంకుల కోసం వినియోగించరాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. తిరునెల్లి టెంపుల్ దేవస్వోమ్‌కు చెందిన డిపాజిట్లను తిరిగి ఆలయానికి వాపసు చేయాలంటూ కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ధర్మాసనం..‘బ్యాంకులను కాపాడుకునేందుకు మీరు ఆలయం సొమ్మును వాడుకోవాలనుకుంటున్నారా? నష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో ఆలయం డబ్బును ఉంచే బదులు, ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు మళ్లించాలని ఆదేశించడంలో తప్పేముంది?’అని పిటిషనర్లను ప్రశ్నించింది. ‘ఆలయం సొమ్ము ఆ దేవతకే చెందుతుంది. అందుకే, ఆ సొత్తును దాచాలి, కాపాడుకోవాలి, ఆలయ ప్రయోజనాల కోసమే వాడాలి. అంతేగానీ, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకు మనుగడకు ఒక వనరుగా ఆ సొమ్ము మారరాదు’అని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.
బ్యాంకులు ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలన్న ధర్మాసనం.. ఖాతాదారులను, డిపాజిట్లను ఆకర్షించలేకపోవడం మీ సమస్య’అని పిటిషనర్లనుద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. అయితే, డిపాజిట్ల ఉపసంహరణ గడువు పెంచాలని కేరళ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఆలయానికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొన్ని సహకార బ్యాంకులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో తిరునెల్లి ఆలయ బోర్డు కోర్టుకెక్కింది.


