అరెస్టు నుంచి రక్షణ జనవరి 19 వరకు పొడిగింపు
కౌంటర్ దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఇస్తామన్న కోర్టు
రెండు వారాలు సరిపోతుందన్న ఏపీ సర్కారు
అయినప్పటికీ విచారణను జనవరికి వాయిదా వేసిన ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ యువనేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి(chevireddy mohith reddy)కి సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఏపీ లిక్కర్ కేసులో ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జనవరి 19 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. కేసును త్వరగా తేల్చాలని, ఎక్కువ గడువు ఇవ్వొద్దని కోరినప్పటికీ, ధర్మాసనం విచారణను జనవరికి వాయిదా వేసింది.
రెండునెలల గడువు వద్దే వద్దు..
జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఎదుట సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయడానికి ‘రెండు నెలల సమయం’ ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ న్యాయవాది వెంటనే జోక్యం చేసుకుని.. ‘మై లార్డ్స్.. మాకు రెండు నెలల సమయం వద్దు. కేవలం రెండు వారాలు చాలు. ఈ కేసులో పిటిషనర్ (మోహిత్‌రెడ్డి) ఇప్పటికే అరెస్టు నుంచి రక్షణ పొందుతున్నారు.
ఎక్కువ రోజులు వాయిదా వేస్తే అది దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కౌంటర్ దాఖలు చేయడానికి మాకు రెండు వారాల సమయం చాలు’ అని కోర్టును కోరారు. అంతేగాక.. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారని, ఆయన అందుబాటులో లేనందున తదుపరి తేదీని నిర్ణయించాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. అప్పటివరకూ మోహిత్‌రెడ్డిని అరెస్టుచేయడానికి వీల్లేకుండా ఉన్న మధ్యంతర రక్షణ కొనసాగనుంది.


