16 ఏళ్లుగా యాసిడ్ దాడి కేసు
పెండింగ్‌లో ఉండటంపై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ వైఖరి వ్యవస్థను అపహాస్యం చేయడమేనంటూ తప్పుబట్టింది. పెండింగ్‌లో ఉన్న యాసిడ్ దాడి కేసుల వివరాలను నాలుగు వారాల్లోగా తమ ముందుంచాలని అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడి కేసుల సత్వరణ విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విషయం కూడా తమ పరిశీలనలో ఉందని తెలిపింది.
యాసిడ్ దాడుల బాధితులను దివ్యాంగుల జాబితాలో చేర్చి వారికి సంక్షేమ పథకాలను వర్తింప జేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ షహీన్ మాలిక్ అనే బాధితురాలు వేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగి్చల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రోహిణి కోర్టులో 2009లో బాధితురాలు షహీన్ మాలిక్ వేసిన కేసు 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.
బాధితురాలు ధర్మాసనం ఎదుట స్వయంగా హాజరై తన వాదన వినిపించారు. తనపై జరిగిన యాసిడ్ దాడిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని తెలిపారు. 2013 వరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికి తుది దశకు చేరుకుందని ఆమె వివరించారు.‘దేశ రాజధాని పరిస్థితులే ఇలాగుంటే బాధితుల గోడు పట్టించుకునేదెవరు..? ఈ పరిస్థితి మన వ్యవస్థకు, జాతికే సిగ్గుచేటు’అని తీవ్రంగా వ్యాఖ్యానించింది.
ఈ కేసును సుమోటో తీసుకుంటున్నామని, విచారణ ఇకపై రోజువారీగా జరపాలని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో, యాసిడ్‌ను బలవంతంగా శరీరంలోకి ఇంజెక్షన్ చేసిన, తాపించిన ఘటనలు కూడా ఉన్నాయని బాధితురాలు షహీన్ మాలిక్ తెలిపారు. యాసిడ్ శరీరంలోకి వెళ్లిన బాధితులకు కృత్రిమ ఆహారాన్ని ట్యూబుల ద్వారా అందించేంతటి తీవ్ర పరిస్థితులున్నాయని, కొందరు అంగవికలురయ్యారని కూడా ఆమె పేర్కొన్నారు.
ఇది విని సీజేఐ సూర్యకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి కూడా జరిగినట్లు ఇప్పటి వరకు తమకు తెలియదన్నారు. అత్యంత ఘోరమైన, బాధితులపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి దారుణాలపై ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరపాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ‘ఇది వ్యవస్థను అపహాస్యం చేయడమే. ఇందుకు బాధ్యులైన వారిపై దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన పనిలేదు. వారికి తగిన విధంగా శాస్తి చేయాల్సిందే’అని ఆయన వ్యాఖ్యానించారు.
వివిధ హైకోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను నాలుగు వారాల్లోగా అందజేయాలని సంబంధిత రిజి్రస్టార్ జనరల్స్‌ను ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా, యాసిడ్ దాడుల బాధితులు సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుగా ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చట్టం కింద వికలాంగుల నిర్వచనంలో చేర్చే విషయమై అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రంతోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో, రోహిణి కోర్టులో ఇన్నేళ్లపాటు ఈ కేసు పెండింగ్‌లో ఉండటానికి దారి తీసిన కారణాలపై వచ్చే వారం విచారణ చేపడతామని కూడా ధర్మాసనం ప్రకటించింది.


