అదే నేను ఇవ్వాలనుకుంటున్న సందేశం
పెండింగ్ కేసుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సామాన్య ప్రజల కోసమేనని, తాను ఇవ్వాలనుకుంటున్న సందేశం అదేనని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన టైమ్‌లైన్, ఏకీకృత జాతీయ జ్యుడీషియల్ విధానం తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.
శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ప్రజలకు న్యాయం సులభంగా అందాలన్నారు. లిటిగేషన్ వ్యయాన్ని తగ్గించడం దృష్టి పెట్టానని చెప్పారు. నిర్దేశిత గడువులోగా కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నానని, తద్వారా కక్షిదారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పెండింగ్ కేసులన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయని తాను చెప్పడం లేదని, కేసుల పరిష్కారం అనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు.
పాత కేసులను తొలుత పరిష్కరించాలి
న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. మన రాజ్యాంగం మూడు కీలక విభాగాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన చేసిందని వివరించారు. శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ వేటికవే స్వతంత్రంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ అతిగా జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం ఏర్పాట్లు చేసిందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కొత్త కేసుల కంటే పాత కేసుల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో మధ్యవర్తిత్వం కీలకమైన అస్త్రం అవుతుందన్నారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. పాత కేసులను మొదట పరిష్కరించే దిశగా రాబోయే రోజుల్లో కొన్ని సంస్కరణలు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇందుకోసం తనకు సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి కేసులను విచారించడానికి న్యాయ వ్యవస్థను ఆధునీకరించాలని వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు.


