breaking news
leadership comparision
-
సామాన్యుల కోసమే సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సామాన్య ప్రజల కోసమేనని, తాను ఇవ్వాలనుకుంటున్న సందేశం అదేనని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపారు. ఇందుకోసం స్పష్టమైన టైమ్‌లైన్, ఏకీకృత జాతీయ జ్యుడీషియల్ విధానం తీసుకురావాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడారు. ప్రజలకు న్యాయం సులభంగా అందాలన్నారు. లిటిగేషన్ వ్యయాన్ని తగ్గించడం దృష్టి పెట్టానని చెప్పారు. నిర్దేశిత గడువులోగా కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నానని, తద్వారా కక్షిదారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పెండింగ్ కేసులన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయని తాను చెప్పడం లేదని, కేసుల పరిష్కారం అనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. పాత కేసులను తొలుత పరిష్కరించాలి న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. మన రాజ్యాంగం మూడు కీలక విభాగాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన చేసిందని వివరించారు. శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ వేటికవే స్వతంత్రంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక వ్యవస్థ అధికారాల్లో మరో వ్యవస్థ అతిగా జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం ఏర్పాట్లు చేసిందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. కొత్త కేసుల కంటే పాత కేసుల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం కీలకమైన అస్త్రం అవుతుందన్నారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. పాత కేసులను మొదట పరిష్కరించే దిశగా రాబోయే రోజుల్లో కొన్ని సంస్కరణలు చేపట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇందుకోసం తనకు సహకరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి కేసులను విచారించడానికి న్యాయ వ్యవస్థను ఆధునీకరించాలని వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. -
బానిస మనస్తత్వం ఇంకెన్నాళ్లు?
న్యూఢిల్లీ: మన మెదళ్లలో ఇంకిపోయిన బానిస మనస్తత్వాన్ని రాబోయే పదేళ్లలో పూర్తిగా వదిలించుకోవాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధిలో దేశం పని తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా అభివరి్ణస్తూ మన భారతీయ నాగరికతకు మచ్చతెచ్చే కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ మనదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన ప్రగతి ప్రయాణం ఎక్కడా ఆగడం లేదని హర్షం వ్యక్తంచేశారు. భారత్ కొత్త చరిత్రను లిఖిస్తోందని ఉద్ఘాటించారు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ దేశం కూడా ముందుకు సాగలేదని తేల్చిచెప్పారు. నేడు అన్ని రంగాల్లో వలసవాద మనస్తత్వాన్ని క్రమంగా వదిలించుకుంటున్నామని వివరించారు. స్వశక్తి, స్వయంకృషితో ఎన్నో ఘనతలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టంచేశారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధనకు వలసవాద, బానిస మనస్తత్వం పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. అందుకే ఆ మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందే దిశగా మన దేశం అడుగులు వేస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఇండియాను ప్రపంచ దేశాలు ‘గ్లోబల్ గ్రోత్ ఇంజిన్’గా గుర్తిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆ ఘనతను దేశానికి గర్వకారణంగా భావించడం లేదన్నారు. బానిస మనస్తత్వమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రతి అంశంపైనా మత ముద్ర ‘‘మన దేశం రెండు శాతం, మూడు శాతం ఆర్థిక వృద్ధి కూడా సాధించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే మాట పుట్టించారు. ఆర్థిక ప్రగతిని ప్రజల విశ్వాసంతో ముడిపెట్టారు. మన సమాజాన్ని పేదరికానికి పర్యాయపదంగా మార్చారు. హిందూ నాగరికతకు సంబంధించిన పరిణామాల వల్లనే ఆర్థిక ప్రగతి జరగడం లేదని నిందించారు. పుస్తకాల్లో, పరిశోధన గ్రంథాల్లో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్‌ను చేర్చారు. కుహన మేధావులు నేడు ప్రతి అంశాన్నీ మతం దృష్టితో చూస్తున్నారు. మత ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్న మేధావులు గత ప్రభుత్వాల హయాంలో నమోదైన తక్కువ వృద్ధిరేటు గురించి మాట్లాడడం లేదు. దేశంలో బానిస మనస్తత్వం అనే విత్తనాలు నాటిన మెకాలే విధానానికి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. అంటే మరో పదేళ్లు మిగిలి ఉన్నాయి. ఈ పదేళ్లలో బానిస మనస్తత్వం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించాలి. మౌలిక మార్పునకు ప్రతీక ఆర్థిక వృద్ధితో మనకు తిరుగులేదు. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన బలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి సాధించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే గ్రోత్ డ్రైవర్. ప్రపంచ వృద్ధి రేటు 3 శాతమే ఉంది. జీ7 దేశాల సగటు వృద్ధిరేటు 1.5 శాతమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం 8.2 శాతం వృద్ధిరేటు సాధించడం సామాన్య విషయం కాదు. ఇది కేవలం అంకెలకు సంబంధించిన సంగతి కాదు. గత పదేళ్లలో మనం తీసుకొచ్చిన మౌలిక మార్పునకు ప్రతీక’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
అఖిలేష్ ఇలా.. రాహుల్ అలా
రాహుల్ గాంధీ - అఖిలేశ్ యాదవ్ ఇద్దరు ఒకే తరానికి చెందిన నాయకులు. ఇద్దరూ రాజకీయ వారసత్వమున్న కుటుంబాల నుంచి వచ్చినవారే. అనవసర శక్తులు తొలగించి సమాజ్‌వాదీ పార్టీకి ఆధునిక, ప్రగతిశీల ఇమేజ్ తేవాలని అఖిలేశ్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. పాతతరంతో పోరాడుతున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేకోవర్‌లో భాగంగా అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నింపేందుకు కృషి చేస్తున్నారు. ఇద్దరూ ఈ విషయంలో పార్టీలోని కొన్ని శక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోక తప్పడం లేదు. రాహుల్, అఖిలేశ్ మధ్య సారూప్యత ఉన్నా అఖిలేశ్ నడిచే దారిలో రాహుల్ నడవలేరనిపిస్తోంది. పార్టీపై పట్టు కోసం తండ్రి ములాయంతో అఖిలేశ్ పోరాటం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ నుంచి రాహుల్‌కు సంపూర్ణ సహకారముంది. పార్టీ బాధ్యతలన్నీ దాదాపు ఆమె రాహుల్‌కు అప్పగించారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ను నియమించేందుకు సోనియా గాంధీ సిద్ధంగా ఉన్నా, ఎందుకో వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. 2012 ఎన్నికల తర్వాత అఖిలేశ్ యాదవ్‌ను సీఎం కుర్చీలో ములాయం సింగ్ యాదవ్ కూర్చోబెట్టినప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో ఎవరూ ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. కానీ రాహుల్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. కుటుంబసభ్యులతో కూడిన సమాజ్‌వాదీ పార్టీతో పోల్చితే కాంగ్రెస్‌లో చెక్స్ అండ్ బ్యాలెన్స్‌లు కొంచెం ఎక్కువే. పార్టీ మూడ్ ధిక్కరించి నిర్ణయం తీసుకునే ధైర్యం కాంగ్రెస్ నాయకత్వం చేయలేదు. పాత తరాన్ని పక్కకు పెట్టే ఉద్దేశం తనకు లేదని రాహుల్ పదే పదే చెప్పడంతో పాటు... వాళ్ల అనుభవం పార్టీకి అవసరమని కూడా అన్నారు. పాతతరంతో రాహుల్ గాంధీ ఓ విధంగా రాజీపడిపోయారనే చెప్పాలి. ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగ సంక్షోభమైతేనేమి, పెద్ద నోట్ల రద్దుపై పోరాటం విషయంలోనైతేనేమి అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి సీనియర్ల సహాయసహాకారాలు రాహుల్ గాంధీ తీసుకోవాల్సి వచ్చింది. అఖిలేశ్ విషయానికొస్తే పార్టీపై పట్టు కోసం పార్టీకి వెన్నుదన్నుగా ఉండే బలవంతులను దూరం పెట్టారు. అంతర్గత పోరాటంలో అఖిలేశ్ విజయం సాధించారనే చెప్పాలి. కన్న తండ్రిని సైతం ఎదిరించి పార్టీ గుర్తును కైవసం చేసుకునే స్థాయికి అఖిలేశ్ ఎదిగారు. తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు రాహుల్ గాంధీ కూడా చేశారు. గతంలో ఓ ఆర్డినెన్స్‌ను చించేసి కొత్త తరహా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాహుల్‌ను ఆయన వ్యతిరేకులు ఆడుకున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేశారు. రాహుల్‌తో పోల్చితే అఖిలేశ్ మంచి మార్కులే కొట్టేశారని చెప్పాలి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా అఖిలేశ్ యాదవ్ పరిపాలనకు సంబంధించి అనేక లోటుపాట్లు తెలుసుకునే అవకాశం దొరికింది. అఖిలేశ్ పాలనతో యూపీ ప్రజలకు పెద్దగా ప్రయోజనం కలగపోయినా ఆయన విశ్వసనీయతకు మాత్రం భంగం కలగలేదు. పరిపాలనలో తండ్రి, బాబాయి పెత్తనాన్ని ఆయన దూరంగా పెట్టారనే మాట ఉత్తరప్రదేశ్‌లో వినిపిస్తోంది. పరిపాలనకు సంబంధించి రాహుల్ గాంధీకి ఇప్పటికీ అనుభవం శూన్యమే. సమర్థ పాలన అందించే నాయకుడిగా అఖిలేశ్ యాదవ్ తనను తాను ప్రొజెక్టు చేసుకోవడంలో విజయం సాధించారు. ఈ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలంతా అఖిలేశ్ వెంటే ఉన్నట్టు కనిపిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ భవిష్యత్ రూపు అఖిలేశేనని ఆ పార్టీ నమ్ముతోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ చాలా వెనుకబడే ఉన్నారు. పార్టీని ముందుండి నడిపించగలననే నమ్మకం రాహుల్ గాంధీ ఇంకా కాంగ్రెస్ కేడర్‌కు కలిగించలేదనే చెప్పాలి. అఖిలేశ్ తనంతట తానుగా నాయకుడిగా ఎదిగారన్నది వాస్తవం. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు.


