రాబోయే పదేళ్లలో పూర్తిగా వదిలించుకోవాలి
8.2% వృద్ధి సామాన్య విషయం కాదు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే గ్రోత్ డ్రైవర్
హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడి
న్యూఢిల్లీ: మన మెదళ్లలో ఇంకిపోయిన బానిస మనస్తత్వాన్ని రాబోయే పదేళ్లలో పూర్తిగా వదిలించుకోవాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధిలో దేశం పని తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా అభివరి్ణస్తూ మన భారతీయ నాగరికతకు మచ్చతెచ్చే కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు, అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ మనదేశం గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన ప్రగతి ప్రయాణం ఎక్కడా ఆగడం లేదని హర్షం వ్యక్తంచేశారు. భారత్ కొత్త చరిత్రను లిఖిస్తోందని ఉద్ఘాటించారు. ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ దేశం కూడా ముందుకు సాగలేదని తేల్చిచెప్పారు.
నేడు అన్ని రంగాల్లో వలసవాద మనస్తత్వాన్ని క్రమంగా వదిలించుకుంటున్నామని వివరించారు. స్వశక్తి, స్వయంకృషితో ఎన్నో ఘనతలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టంచేశారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్య సాధనకు వలసవాద, బానిస మనస్తత్వం పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. అందుకే ఆ మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందే దిశగా మన దేశం అడుగులు వేస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఇండియాను ప్రపంచ దేశాలు ‘గ్లోబల్ గ్రోత్ ఇంజిన్’గా గుర్తిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆ ఘనతను దేశానికి గర్వకారణంగా భావించడం లేదన్నారు. బానిస మనస్తత్వమే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ప్రతి అంశంపైనా మత ముద్ర
‘‘మన దేశం రెండు శాతం, మూడు శాతం ఆర్థిక వృద్ధి కూడా సాధించలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే మాట పుట్టించారు. ఆర్థిక ప్రగతిని ప్రజల విశ్వాసంతో ముడిపెట్టారు. మన సమాజాన్ని పేదరికానికి పర్యాయపదంగా మార్చారు. హిందూ నాగరికతకు సంబంధించిన పరిణామాల వల్లనే ఆర్థిక ప్రగతి జరగడం లేదని నిందించారు. పుస్తకాల్లో, పరిశోధన గ్రంథాల్లో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్‌ను చేర్చారు.
కుహన మేధావులు నేడు ప్రతి అంశాన్నీ మతం దృష్టితో చూస్తున్నారు. మత ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు మాపై నిందలు వేస్తున్న మేధావులు గత ప్రభుత్వాల హయాంలో నమోదైన తక్కువ వృద్ధిరేటు గురించి మాట్లాడడం లేదు. దేశంలో బానిస మనస్తత్వం అనే విత్తనాలు నాటిన మెకాలే విధానానికి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. అంటే మరో పదేళ్లు మిగిలి ఉన్నాయి. ఈ పదేళ్లలో బానిస మనస్తత్వం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించాలి.
మౌలిక మార్పునకు ప్రతీక
ఆర్థిక వృద్ధితో మనకు తిరుగులేదు. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన బలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి సాధించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే గ్రోత్ డ్రైవర్. ప్రపంచ వృద్ధి రేటు 3 శాతమే ఉంది. జీ7 దేశాల సగటు వృద్ధిరేటు 1.5 శాతమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం 8.2 శాతం వృద్ధిరేటు సాధించడం సామాన్య విషయం కాదు. ఇది కేవలం అంకెలకు సంబంధించిన సంగతి కాదు. గత పదేళ్లలో మనం తీసుకొచ్చిన మౌలిక మార్పునకు ప్రతీక’’ అని ప్రధాని మోదీ వివరించారు.


